నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి.. పదేళ్లపాటూ ఆ రాష్ట్రాన్ని హైదరాబాదు నగరం నుంచి పరిపాలించగల అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఆయన దానిని తోసిరాజని, అమరావతికి వలసవెళ్లిపోయారు. అక్కడ క్యాంపు కార్యాలయంలో నివాసం ఉంటూ ‘మన రాష్ట్రం నుంచే మన పాలన’ అనే నినాదాన్ని పాటిస్తున్నారు. అందుకు ఆయనను అభినందించే వారు కూడా ఉన్నారు. అయితే కారణాలు తెలియదు గానీ.. ఆయన కుటుంబం మాత్రం ఆయన వెంట వెళ్లలేదు. అయితే కుటుంబం అమరావతికి వెళ్లకపోవడానికి కారణాలు ఏమిటి? నారా చంద్రబాబు కుటుంబం ఆయన వెంట వెళ్లకుండా ఎవరైనా అడ్డుకున్నారా? ఆ కుట్ర చేసినది ఎవరు? అనే సందేహాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. ఈ సందేహాలకు కారణం మరెవ్వరో కాదు.. స్వయంగా చంద్రబాబు కొడుకు లోకేషే కావడం విశేషం.
విశాఖ పార్టీ ఆఫీసు శంకు స్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లోకేష్ చాలా చిత్రమైన అంశాన్ని ప్రస్తావించారు. తన తండ్రి చంద్రబాబునాయుడు, హైదరాబాదుకు వచ్చిన సందర్భంలో.. తన కొడుకు (అంటే చంద్రబాబు మనవడు దేవాంశ్)ను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాడు దగ్గరకు వెళ్లకుండా బేర్ మంటున్నాడంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం హైదరాబాదులో, తాతయ్య అమరావతిలో.. ఇలా ఉండడం వల్ల మనవడితో అనుబంధం ఏర్పడకుండా పోతున్నదని లోకేష్ ఆవేదన వెలిబుచ్చారు. సభలో ఉన్న తాత, అవ్వ లందరూ దీన్ని గురించి ఆలోచించాలని ఆయన పిలుపు ఇచ్చాడు.
ఇటీవల సుజనాచౌదరి ఇంట్లో పెళ్లికని హైదరాబాదు వెళ్లినప్పుడు, చంద్రబాబు దగ్గరకు తీసుకోబోతే మనవడు రాలేదుట. ఏడ్చాడుట. దానికి లోకేష్ చెప్పిన భాష్యం ఇది. తద్వారా.. బహుశా చంద్రబాబునాయుడు చాలా త్యాగం చేస్తున్నారని, రాష్ట్రం కోసం కుటుంబాన్ని వదలి పనిచేస్తున్నారని.. ఆయనంతటి త్యాగపురుషుడు మరొకరు లేరని చెప్పడం లోకేష్ ఉద్దేశం కావొచ్చు. అయితే ఆయన మాటలను బట్టి సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. నారా చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లిపోయిన తర్వాత.. ఆయన కుటుంబం ఇంకా హైదరాబాదులో ఎందుకు ఉంటున్నట్లు? వారు అమరావతికి వెళ్లడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అందరూ అక్కడకు వెళ్లిపోతే ఎంచక్కా తాతా మనవడూ మధ్య అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది కద! కుటుంబం వెళ్లకుండా వారిని ఎవ్వరైనా అడ్డుకుంటున్నారా? అని జనం ప్రశ్నిస్తున్నారు.
వారిలో మరో సందేహం కూడా ఉంది. చంద్రబాబు రాష్ట్రం కోసం అమరావతిలో ఉన్నాడేమో గానీ, ఆయన కుటుంబం మొత్తం వ్యాపారాలు చూసుకోవడం కోసం హైదరాబాదులో ఉంటున్నారు. వాళ్ల వ్యాపారాలు వాళ్లు చూసుకోవడానికి హైదరాబాదునుంచి కదలకుండా.. దాన్ని కూడా త్యాగంగానే భావించాలని వారు కోరుకుంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని… ఏదో చెప్పబోయి, మరేదో చెప్పేసి.. తమ వ్యాపారం కోసం తాము హైదరాబాదులో నివాసం ఉంటే, దాన్ని త్యాగంగా రంగు పులమదలచుకుని చిత్రమైన చిన్నెలు పోతున్నారని.. ఇలాంటి వాటివల్ల తండ్రీ కొడుకులు ఇద్దరూ నవ్వులపాలు కావడమే తప్ప మరో ప్రయోజనం ఉండకపోవచ్చునని పలువురు అంటున్నారు.