ఒకవైపు ఎదిగివస్తున్న నాయకులు, లోకేష్ నాయకత్వంలో పెరుగుతున్న యువనేతలు, మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి యువ ఎమ్మెల్యేలు అనేక మంది వలసల రూపంలో వెల్లువలా తెలుగుదేశంలోకి వస్తూ ఉండడం… మరో వైపు ఎంతో అనుభవజ్ఞులు అయిన ఇతర పార్టీల నాయకులు కూడా .. ఏపీలో తమ భవిష్యత్ ప్రస్థానానికి తెలుగుదేశం పార్టీనే బెస్ట్ అని ఎంచుకుంటూ ఉండడం.. ఈ పరిణామాలు అన్నీ పార్టీకి లాభిస్తున్నాయి. యువశక్తితో పాటూ.. సీనియర్లు, అనుభవజ్ఞుల బలం కూడా ఆ పార్టీకి పెరగనుంది. తాజా పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీ కురువృద్ధుల్లో ఒకరు గాదె వెంకటరెడ్డి కూడా తెలుగుదేశంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉండడం దీనికి సంకేతంగానే నిలుస్తున్నది.
గాదె వెంకటరెడ్డి అనుభవం రీత్యా చాలా పెద్ద నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలలో వైఎస్‌ఆర్ జమానా మొదలయ్యే ముందు అంచె వరకు ప్రతిసారీ మంత్రిపదవిని నిర్వహించినంతటి సీనియర్ నాయకుడు ఆయన. వైఎస్‌ఆర్ హవా మొదలైన తర్వాత.. ప్రాభవం మసకబారిన వారిలో ఒకరు. రాష్ట్ర విభజనకు ఉద్యమాలు జరుగుతున్న సమయంలో.. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే వాదనను చాలా గట్టిగా వినిపించిన వ్యక్తి. ఆ విషయంలో పార్టీ అధిష్ఠానంతో విభేదించడానికి కూడా ఆయన వెనుకంజ వేయలేదు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయిన తర్వాత.. ఆయన అంతో ఇంతో తెదేపాకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు.
ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయన చంద్రబాబు గణంలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శుక్రవారం గాదె వెంకటరెడ్డి తెదేపాలో చేరుతారని తెలుస్తున్నది. గాదె వెంకటరెడ్డి పార్టీలో చేరడం అంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఇతర సీనియర్లకు కూడా ఆ పరిణామం మార్గదర్శకం అయినా ఆశ్చర్యం లేదు. గాదె కూడా వచ్చినట్లయితే.. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు, అనుభవజ్ఞుల జాబితా పెరుగుతుంది. ఎటూ వైకాపాకు రాజీనామాచేసిన మైసూరారెడ్డి తెదేపాలోకి రావడం గ్యారంటీ అయిన నేపథ్యంలో గాదె కూడా వచ్చినట్లయితే.. తలపండిన, అనుభవం పండిన పార్టీకి మార్గదర్శనం చేయగల పెద్దల సంఖ్య పెరుగుతుందని పలువురు అంటున్నారు.