‘దమ్ముంటే చర్చకు రా’ అంటూ వైఎస్ జగన్మోహనరెడ్డికి లోకేష్ విసిరిన సవాలుకు ఆయన తరఫున రోజా స్పందించారు. లోకేష్ ఒక పప్పుసుద్ద… జగన్ వంటి ప్రజానాయకుడిని దమ్ముందా అని అడిగే అర్హత అసలు లోకేష్‌కు లేనేలేదని రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ ఇదే తరహాలో తెలంగాణలో కూడా ‘దమ్ముందా.. దమ్ముందా..’ అంటూ కేసీఆర్‌కు కూడా పలుమార్లు సవాళ్లు విసిరారని, ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీ ఏ స్థితిలో ఉన్నదో అందరికీ తెలుసునని రోజా అన్నారు. ఏపీలో కూడా తెలుగుదేశం అదే స్థితికి చేరుకుంటుందని దుమ్మెత్తిపోసారు.
పనిలో పనిగా.. చంద్రబాబునాయుడు అవినీతి మీద కూడా రోజా విమర్శలను సంధించారు. బాబు అవినీతి మీద సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్‌ను వినిపించారు. ఇవాళ వైఎస్ జగన్మోహనరెడ్డి ఏపీలో జరుగుతున్న అరాచకాల గురించి.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తూ ఉంటే.. దాని గురించి ఏపీ బ్రాండ్‌ను చెడగొట్టడానికే జగన్ వెళ్లారంటూ ఆడిపోసుకుంటున్న చంద్రబాబునాయుడు సర్కారు వైఖరిని కూడా రోజా కడిగిపారేశారు. గతంలో వైఎస్ఆర్ పాలనలో.. రాజా ఆఫ్ కరప్షన్ అంటూ చంద్రబాబు పుస్తకాలు ముద్రించి.. ఢిల్లీ గల్లీల్లో తిరిగి ప్రతి నాయకుడికీ పంచిపెట్టారని, అప్పట్లో మీరు ఏపీ బ్రాండ్ ను దెబ్బతీయడానికే అలా చేశారా అంటూ రోజా ప్రశ్నించారు.
జగన్ మీదికి లోకేష్ సవాళ్లు విసిరిన నేపథ్యంలో.. లోకేష్ మాటలకు స్పందించడం తన స్థాయి కాదని జగన్ భావిస్తారని, తన అనుచరులతో ఎవరిద్వారానైనా ప్రతివిమర్శలు చేయిస్తారని తెలుగు360 ముందే విశ్లేషణలో తెలియజేసింది. దానికి తగ్గట్లుగానే జగన్ తరఫున రోజా తెరపైకి వచ్చి, లోకేష్ మీద వాగ్దాడులకు పూనుకోవడం విశేషం.