ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో చాలా కీలకంగా, కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా ఉన్న లోకేష్‌కు మంత్రి పదవి అనే అంశానికి తెరపడింది. ఆయన స్వయంగా ఈ విషయంపై చర్చకు ఫుల్స్టాప్పెట్టారు. తాను కేబినెట్లోకి రావడం, మంత్రి పదవి స్వీకరించడానికి సంబంధించి జరుగుతున్న చర్చ అంతా అవాస్తవం అని ఆయన తేల్చిచెప్పారు. 2019 ఎన్నికల్లో మాత్రం బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చారు. లోకేష్‌ను చంద్రబాబు కేబినెట్లోకి తీసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో తెలుగుదేశంలోని వందిమాగధులంతా ఆయనను స్తుత్తిస్తూ కీర్తిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయడం, మేం త్యాగం చేస్తాం.. మా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీట్లలోంచి నెగ్గి లోకేష్ మంత్రి కావాలి.. అంటూ స్వామిభక్తిని ప్రదర్శించడం ఇవన్నీ అందరూ గమనించారు. ఇలాంటి స్తోత్రపాఠాలకు కూడా లోకేష్‌కు ఒక రకంగా చెక్ పెట్టారు.
లోకేష్ అవినీతికి పాల్పడుతున్నాడంటూ జగన్ చేసిన ఆరోపణల మీద ‘దమ్ముంటే చర్చకు రా’ అంటూ సవాలు విసిరిన లోకేష్, గురువారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా కూడా మళ్లీ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. అవినీతిపై చర్చకు తాను సిద్ధం అని ఆయన ప్రకటించారు.
జగన్‌కు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నేతలు ఎవ్వరూ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, అందరినీ ఆయన పార్లమెంటు సెంట్రల్ హాల్లోనే కలుస్తున్నారని కూడా లోకేష్ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ ఎలాంటి అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చినా వాటితో తమ కుటుంబానికి ముడిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ జగన్ ఆరోపించడం విశేషం. అలాగే.. ఏడేళ్ల నుంచి తమ కుటుంబం ప్రతి సారీ కుటుంబసభ్యుల ఆస్తులను ప్రకటిస్తూ వస్తున్నామని, జగన్ తన ఆస్తులను ఎందుకు ప్రకటించడం లేదని కూడా లోకేష్ ప్రశ్నించడం విశేషం.
మొత్తానికి లోకేష్ ప్రెస్‌మీట్ ద్వారా తేల్చిన సంగతేంటంటే… ఆయన ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్ మీద కన్నేయడం లేదు. అయినా…. అన్నీ తానే అయి నడిపిస్తున్నప్పుడు.. ఇక ఒక శాఖకు పరిమితం కావడం ఎందుకని ఆయన భావిస్తున్నారా.. అనే విమర్శలు చేసేవారు కూడా ఉంటారు! ప్రతి పరిణామానికీ విమర్శకులు వెతుక్కునే పాయింట్లు వేరే ఉంటాయి కదా!!