పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడ కలెక్టర్ లోకేశ్ కుమార్, ఎస్పి షా నవాజ్ భాసి టిఆర్ఎస్ ఏజంట్లుగా వ్యవహరిస్తున్నారని లిక్కర్ వంటివి విచ్చలవిడిగా పంపిణీ అవుతున్నా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన బదిలీ ఉత్తర్వులిచ్చేశారు. హైదరాబాద్‌లో నీటిసరఫరా సీనరేజి బోర్డు చైర్మన్‌గా వున్న పి.దానకిశోర్‌ను కలెక్టరుగానూ రంగారెడ్డి జిల్లా ఎస్పి రమా రాజేశ్వరిని ఎస్పిగానూ నియమించారు. ఇది ఎన్నికల నియమావళి పట్ల తమ గౌరవానికి నిదర్శనమని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్లీనరీలో కూడా ప్రత్యేకంగా ప్రకటించారు.
అయితే ఈ బదిలీల విషయంలో టిఆర్ఎస్ పని రొట్టె విరిగి నేతిలో పడినట్టయిందని మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వచ్చిన వారు వెళ్లిన వారికంటే టిఆర్ఎస్కు వీర విధేయులు కావడమే అందుకు కారణం. స్టాంపు తరహాలో వుంటారని చెబుతున్నారు. కనక బదిలీ అయిపోయిందని వూరుకోకుండా ప్రత్యర్థులు అప్రమత్తంగా వుండాల్సిందేనని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. సిఎం అంత ప్రత్యేకంగా చెప్పడం కూడా అందుకోసమేనని లేకపోతే ఈ విధమైన ఉత్తర్వులను రాజకీయంగా వ్యతిరేకిస్తారని పరిశీలకులు అంటున్నారు.