జగన్మోహన్ రెడ్డి డిల్లీ వెళ్లి తెదేపాకి, దాని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తన వల్ల చేతనయినంతా నష్టం చేస్తున్నారు. జాతీయ పార్టీల నేతలని, కేంద్ర మంత్రులని కలిసి రాష్ట్రంలో చాలా భారీ అవినీతి జరుగుతోందని, తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెదేపాలో చేర్చుకొంటోందని పిర్యాదులు చేస్తున్నారు. ఇవ్వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ప్రధాన ఎన్నికల కమీషనర్ నదీం జైదీని కలిసి చంద్రబాబు నాయుడిపై పిర్యాదు చేసారు. ఆయనపై చట్టప్రకారంగా తగు చర్యలు చేపట్టాలని అభ్యర్ధించారు.
జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఈ ‘సేవ్ డెమోక్రసీ’ కార్యక్రమం వలన ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెదేపాకి వచ్చే నష్టం, ప్రమాదం ఏమీ లేకపోయినా, దీర్ఘకాలంలో దాని దుష్ప్రభావం తప్పకుండా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధుల ఖర్చు విషయంలో చాలా అవకతవకలకు పాల్పడుతోందని భాజపా నేతలే పిర్యాదు చేస్తున్నారు. కేంద్రం కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. కనుక అది ఎక్కడెక్కడ ఏవిధంగా ఎంత మేరకు అవినీతికి పాల్పడిందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చక్కగా పుస్తక రూపంలో అచ్చేసి మరీ ఆర్ధికమంత్రి చేతిలో పెడితే ఏమవుతుందో ఊహించుకోవచ్చు. తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలని చాలా ఆత్రపడుతున్న పురందేశ్వరి, కన్నా లక్ష్మి నారాయణ, సోము వీర్రాజు వంటి రాష్ట్ర భాజపా నేతలు ఈ అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. ఈరోజు కాకపోయినా రేపయినా తెదేపాతో తెగతెంపులు జరిగితే తెదేపాని విమర్శించడానికి ఈ పుస్తకం వారికి మంచి రిఫరెన్స్ గా పనికివస్తుంది.
అయితే జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వానికి నష్టం చేయగలుగుతున్నారు కానీ తన అసలు సమస్య ఎమ్మెల్యేల ఫిరాయింపులని అడ్డుకోలేకపోవచ్చు. ఎందుకంటే ఆ విషయంలో కేంద్రం కలుగజేసుకాదు. చేసుకొంటే ఏమవుతుందో దానికీ తెలుసు. తెదేపా కూడా అన్నిటికీ ఇప్పుడు తెగించే ఉంది కనుక భాజపాతో తెగతెంపులు చేసుకోవచ్చు లేదా ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ, పోలవరం, రైల్వే జోన్ ఏర్పాటు జాబితాను బయటకు తీసి వాటి సంగతేమీ చేసారని నిలదీయవచ్చు లేదా కేంద్రప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కూల్చడం గురించి ప్రశ్నించవచ్చు. అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్రం ఇష్టపడకపోవచ్చు కనుక వైకాపా ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కలుగజేసుకోకపోవచ్చు.
ఇంక ఈవిషయంలో కేంద్రప్రభుత్వమే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే, ఫిరాయింపులపై చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అధికారం లేని ఎన్నికల కమీషనర్ మాత్రం ఏమి చేయగలరు..జగన్ వినతి పత్రాన్ని స్వీకరించి భద్రంగా ఫైల్లో పెట్టుకోవడం తప్ప. కనుక జగన్ డిల్లీ వెళ్ళినా ఆయన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం లేదు. కాకపోతే తనతో పాటు తెదేపాను కూడా ముంచే ప్రయత్నాలు గట్టిగానే చేసారని చెప్పవచ్చు. అవి ఎంతవరకు ఫలిస్తాయో రానున్న కాలమే చెపుతుంది.