ఖమ్మం జిల్లాలో పాలేరు ఉపఎన్నికలలో భాజపా పోటీ చేయబోవడం లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వైకాపా, తెదేపాలు మద్దతు ప్రకటించాయి. సిపిఎం తరపున పోతినేని సుదర్శనరావు పోటీ చేస్తున్నారు. అధికార తెరాస తరపున మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కాంగ్రెస్ తరపున దివంగత రామిరెడ్డి వెంకట రెడ్డి భార్య సుచరిత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఓటు లభించే అవకాశం ఉండటం, మంత్రి తుమ్మలకి జిల్లాపై మంచి పట్టున్న కారణంగా పోటీ ప్రధానంగా కాంగ్రెస్, తెరాసల మధ్యనే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
ఈ ఉపఎన్నికలలో భాజపాని సంప్రదించకుండానే తెదేపా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా, ఎన్నికలకు దూరంగా ఉండాలనుకొంటున్న సంగతిని భాజపా తెదేపాకి తెలియజేయకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనిస్తే ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందనే విషయం అర్ధం అవుతుంది.
ఎన్నికలలో పోటీ చేసి తెరాస చేతిలో మరోసారి ఓడిపోయి పరాభవం పాలవడం కంటే ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరిస్తామని చెప్పుకొంటున్న భాజపా వాస్తవ పరిస్థితికి ఈ నిర్ణయం అద్దం పడుతోందని చెప్పవచ్చు.