బ్యాంకులను మోసం చేసి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి భారత్ కి పంపించవలసిందిగా కోరుతూ డిల్లీలోని బ్రిటిష్ హైకమీషనర్ కి భారత విదేశాంగ శాఖ ఒక లేఖ వ్రాసింది. అలాగే లండన్ లోని భారత్ హైకమీషనర్ ద్వారా బ్రిటన్ విదేశాంగశాఖకు కూడా ఒక లేఖ అందజేస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలియజేసారు.
విజయ్ మాల్యాపై ఈడి అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. వారి అభ్యర్ధన మేరకు ఆయన పాస్ పోర్ట్ కూడా రద్దు చేయబడింది. అయినా విజయ్ మాల్యా ఏమాత్రం చలించకపోవడం విశేషం. ఎందుకంటే ఆయనకు 1992 నుంచే బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. ఈ విషయం గురించి ఆయన రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లో కూడా పేర్కొనకుండా దాచిపెట్టి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ కారణంగా ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ నిర్ణయించింది. మే 3న దానిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
విజయ్ మాల్యాకి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది కనుక, అతనిని భారత్ కి పంపించదానికి బ్రిటన్ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అనుమానమే. ఒకవేళ పంపించదలచుకోకపోతే మాత్రం, విజయ్ మాల్యాని భారత్ తిరిగి రప్పించడం దాదాపు అసంభవమేనని భావించవచ్చు.