విశాఖ జిల్లాలోని అరుకు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తెదేపాలో చేరుతూ చెప్పిన కొన్ని మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
కిడారి సర్వేశ్వరరావు విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల గురించి కూడా మాట్లాడారు. తను ఆ విషయం గురించి ముఖ్యమంత్రితో మాట్లాడానని, ప్రభుత్వం బాక్సైట్ త్రవ్వకాలకు అనుమతించదనే తను నమ్ముతున్నానని అన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఆయన వైకాపాలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారు కానీ ఇప్పుడు తెదేపాలో చేరిన తరువాత దానిని వ్యతిరేకించలేరు. కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు మళ్ళీ అనుమతిస్తే సర్వేశ్వర రావుకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.
తనతో సహా తెదేపాలో చేరుతున్న ఎమ్మెల్యేలు అందరూ డబ్బుకో, పదవులకో ఆశపడి పార్టీలో చేరడం లేదని కేవలం తమతమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నామని చెప్పారు. ఇది తెదేపాలో చేరుతున్నవారందరూ చెప్పేమాటే కానీ దానిని మరికొంత లోతుగా పరిశీలిస్తే, వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను తెదేపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు చెపుతున్నట్లుంది. ఆ మాటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే వారు చెపుతున్నప్పటికీ, దానిని ఆయనతో సహా ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోకపోవడం ఆశ్చర్యంగానే ఉంది. అంటే తెదేపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలనే తెదేపా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా? వాటినే అభివృద్ధి చేస్తుందా? అనే అనుమానం కలుగుతోంది. అదే నిజమయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ సమానంగా అభివృద్ధి చేస్తున్నానని చంద్రబాబు నాయుడు అబద్దం చెపుతున్నారనుకోవాలా? ఏమో..ఆ విషయం గురించి తెదేపాలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రే చెప్పాలి.