హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులంతా దొంగలా? దొంగ వోట్లు వేయడమే పనిగా ఎంచుకున్నారా? నాయకులు వారిని అనుమానంగా చూడడం కరెక్టేనా? హైదరాబాద్ లో ఉంటున్న సీమాంధ్రుల మనోభావాలు గాయపడుతాయని గుర్తించే సహృదయం నాయకులకు లేదా? ఇప్పుడు ఇలాంటి సవాలక్ష సందేహాలు కలుగుతున్నాయి. ఢిల్లీ టూర్ లో ఉన్న జగన్ ఎన్నికల సంఘాన్ని కలిసి చేసిన వినతులు చూస్తోంటే.. ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. నాయకుల వైఖరిపై భయాలు పుడుతున్నాయి.
తన పార్టీ నుంచి వలసలు వెళుతున్న ఎమ్మెల్యేల మీద కత్తి దూయడం అనేది జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం. అందుకోసం అయన ఏకంగా ఢిల్లీ గద్దెను కదిలించి, ఫిరాయింపు చట్టాలనే మార్చడానికి సిద్ధపడ్డారు. అందుకోసం అయన ఢిల్లీ వెళ్లి ఫిరాయింపు చట్టాన్ని ప్రయోగించి, అనర్హులను చేసే అధికారం స్పీకర్ చేతిలో కాకుండా ఈసీ చేతిలో ఉండాలంటూ ఒక ఫిర్యాదు చేసారు. ఇలాంటి చట్టం వస్తే మంచిదే.. కానీ అది భవిష్యత్తులో జగన్ కు కూడా నష్ట దాయకంగా మారవచ్చు. ఈ అంశం పక్కన పెడితే… అయన ఈసీ కి చేసిన మరో ఫిర్యాదు కీలకం అయినది.
హైదరాబాద్ నగరంలోను, ఆంధ్ర ప్రదేశ్ లోను ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని జగన్ ఈసీ కి ఫిర్యాదు చేసారు.
హైదరాబాద్ నుంచి సీమాంధ్రులంతాా ఎన్నికలప్పుడు ఏపీ కి వచ్చి అక్కడ కూడా వోట్లు వేసేస్తున్నారనేది అయన ఆరోపణ. హైదరాబాద్ లో ఉండే సీమాంధ్రులంతాా టీడీపీ కే వోట్లు వేసే బాపతు అని జగన్ ఫిక్స్ అయినట్లుగా, ఈసీ ముందు వారి నైతికత ను అనుమానించినట్లుగా ఈ ఆరోపణ ఉన్నది. రాజధానిలో ఉన్న వారిలో, జగన్ వీరాభిమానులు కూడా పుష్కలంగా ఉన్నారు.
ఒక రకంగా చుస్తే.. అచ్ఛంగా ఇది గతంలో కెసిఆర్ అవమానించిన తీరుగానే ఉండడం విశేషం. సీమాంధ్రులను తిట్టడం తన వోట్ బ్యాంకు ను పెంచుతుందని, కెసిఆర్ తిట్టినా అర్ధముంది. కానీ, జగన్ కెసిఆర్ తరహాలో అవే ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి కెసిఆర్ ఒక దశలో నగరంలోని సీమాంధ్రుల మీద ఇలా సూటిపోటీ మాటలు అన్నప్పటికీ, తర్వాత తన తీరు మార్చుకున్నారు. హైదరాబాద్ లోని ఆంధ్రోళ్లంతా నా బిడ్డలే అని చెప్పుకున్నారు. వారిపట్ల ఆయన వ్యవహార సరళి లో కూడా మార్పు వచ్చిందనే చెప్పాలి. అయితే జగన్ ఇప్పుడు కొత్తగా వారిని అనుమనించడం ప్రారంభిస్తున్నారు. నిజానికి నగరంలోని ఆంధ్రోళ్లకు ఇది చాల అవమానకరం కూడా. జగన్ కు ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో గానీ, ఏపీ లో కూడా అయన పార్టీ కి ఇలాంటి వైఖరి చేటు చేస్తుందని పలువురు విశ్లేషిస్తున్నారు.