ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి అప్పుడే రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకు అనేక విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. వాటిలో ఉమ్మడి హైకోర్టు విభజన కూడా ఒకటి. దానిని విభజించమని తెలంగాణా ప్రభుత్వం గత రెండేళ్ళుగా ఎన్నిసార్లు కేంద్రానికి మొరపెట్టుకొన్నా ‘ఇదిగో..అదిగో..’అనడమే కానీ ఆ పని మాత్రం చేయలేదు. కారణం అందరికీ తెలిసినదే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడయినా హైకోర్టు ఏర్పాటు చేసుకొనే వరకు ఉమ్మడి హైకోర్టుని విడదీయడానికి విభజన చట్టం అంగీకరించదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు చూస్తుంటే మరో మూడేళ్ళలోగా కూడా అమరావతిలో హైకోర్టు నిర్మించే అవకాశం ఉన్నట్లు కనబడటం లేదు. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక ఉమ్మడి హైకోర్టు విభజన ఇప్పట్లో సాధ్యం కాదని అర్ధమవుతోంది. అదే విషయం కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ నిన్న లోక్ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లిఖితపూర్వకంగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో హైకోర్టు నిర్మించుకోకపోవడం వలననే జాప్యం జరుగుతోందని, కనుక దానికి అదే కారణమని జవాబు చెప్పారు. ఇది ఎవరికీ తెలియని రహస్యమేమీ కాదు. ఇరు రాష్ట్రాల ప్రజలకి, నేతలకి, ప్రభుత్వాలకి అందరికీ తెలుసు. అయితే తెలంగాణా ప్రభుత్వం, ఎంపిలు, న్యాయవాదుల సంఘాలు గతంలో అనేకసార్లు దీని గురించి సదానంద గౌడపై ఒత్తిడి తెచ్చినప్పుడు అయన రకరకాల మాటలు చెప్పేవారు.
ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకి తగిన భవన సముదాయం సమకూర్చుకొంటే, మూడు నెలలోగా విభజన ప్రక్రియను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ తరువాత అది సాధ్యం కాదని హైకోర్టు తీర్పు చెప్పడంతో వెనక్కి తగ్గారు. తరువాత సుప్రీం కోర్టుతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరిస్తానన్నారు కానీ నేటికీ పరిష్కరించలేదు. రెండేళ్ళ తరువాత ఇప్పుడు తాపీగా అసలు విషయం బయటపెట్టి ఈ జాప్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వందే బాధ్యత అని చేతులు దులిపేసుకొన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడకి హైకోర్టు విభజనకి చట్టం అంగీకరించదనే సంగతి తెలియకనే ఆవిధంగా హామీలు ఇచ్చేరనుకోవాలా లేకపోతే తెలంగాణా ప్రభుత్వాన్ని, ప్రజలని మభ్యపెట్టడానికే ఆవిధంగా హామీలు ఇస్తూ కాలక్షేపం చేశారనుకోవాలా?