పక్కన పిడుగుపడినట్టు ఉలిక్కిపడ్డాడు బాబు. వచ్చిన వార్తాహరుడ్ని మరోసారి చెప్పమన్నాడు.
`చిత్తం మహాప్రభో… నేనువిన్నది అదేనండీ, జగన్ గారు మిమ్మల్ని ఓదార్చడానికి వస్తున్నారట’
మరోసారి ఉలిక్కిపడ్డాడు బాబు. జగన్ తనదారినతాను ఓదార్పు యాత్రలుగట్రా చేసుకుంటున్నాడని బాబుకు తెలియందేమీకాదు. కానీ, ఇలా నేరుగా తన ఇంటికే వచ్చి, తననే ఓదార్చడమేమిటో బాబుకి ఎంతగా ఆలోచించినా అర్థంకాలేదు.
ఆ వార్త విన్నప్పటి నుంచీ బాబు ఇంటి ముఖద్వారంవైపే చూస్తున్నారు. ఎప్పుడు ఉపద్రవం వస్తుందో తెలియడంలేదు. కంటిమీద కునుకులేదు. మిత్రులు, మంత్రులు వచ్చినా మాట్లాడంలేదు. ఇంట్లోవాళ్లని పలకరించడంలేదు.
`ఓదార్పు..ఓదార్పు…నాకు ఓదార్పు..’వంటి మాటలుతప్ప మరేమాట అనడంలేదు.
అంతలో ఇంటిముందు అలికిడి.
పొడుగుచేతుల చారల చొక్కా వేసుకున్న ఒక బక్కపలచ వ్యక్తి తన తలకాయ కుడివైపుకు వంచుతూ, చేతులూ రెండూ జోడిస్తూ, అదోరకంగా నవ్వుతూ … తనను పట్టించుకునేవారున్నాలేకున్నా, తానుమాత్రం చిరునవ్వుతో పలకరిస్తూ వస్తున్నాడు…లోపలకు వడివడిగా…
బాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. `ఇదెక్కడి ఉపద్రవం. ఓదార్చడానికి నేనే దొరికానా… హే గోదావరిమాతా, ఇప్పుడేమిటి కర్తవ్యం’
ప్రధాన వాకిలివైపు మరోసారి చూశాడు. అదే స్టైల్, అదే రూపం…అలాగే ఉన్నాడు.
`ఇతను అతనుకాదుకదా… ఆ అతనే ఇతను కాకుంటే…ఇతను..అతను, అతనే ఇతను…ఛీ, ఛీఛీ ఏమైంది నాకు, మాట తడబడుతోంది’
వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు బాబు.
` తానేంటీ, తన అనుభవమేమిటీ, ఈ పిల్లకాకికి తాను బెదరడమేమిటీ !! రాజకీయాల్లో తిమ్మినిబొమ్మనుచేసే సామర్థ్యం తనది. తనకున్న రాజకీయ చతురత ఈ బుడంకాయకు ఉంటుందా? ఉండదుకాక ఉండదు. మనం ముందుకు పోతున్నట్టు అతగాడు పోగలడా ? వయసు 60ఏళ్లు దాటినా ముందుకుపోవడంలో మనమే ఫస్ట్ . ఆ విషయం తమ్ముళ్లందరికీ తెలుసు. కానీ ఈ పొడుగుచారల చొక్కావేసుకున్న వ్యక్తికి తెలియదే. అదే వచ్చిన చిక్కు. తనకే అంతా తెలుసనుకుంటాడు. `కుర్చీఅంటే సీఎం కుర్చేనే’ అని అడ్డంగా వాదించే మొండిపిల్లాడు. ఇలాంటి వాళ్లతోనే వచ్చినచిక్కంతా. చెబితే వినరు, గిచ్చితే ఏడుస్తారు. అదిగో, లోపలకు వచ్చేస్తున్నాడు. ఇక బాగుండదు. నేనూ పలకరించాల్సిందే, ఏమంటాడో చూద్దాం…’
జగన్ నేరుగా లోపలకు వచ్చేస్తూ, బాబు చేతులు అమాంతం పట్టేసుకుని, ఆపైన బుగ్గలమీద చేతులరాస్తూ, తనదైన శైలిలో ఓదార్పు మొదలుపెట్టాడు.
బాబుకు చిరాకేసింది.
`ఛీ..ఛీఛీ ఏమిటయ్యాఇది..ఎవరైనా చూస్తే బాగుండదు’
ఛీత్కారనికి ఏమాత్రం కోపగించుకోకుండా జగన్…
`బాబుగారూ, మీకెంత కష్టమెచ్చిందీ, మీ పెరిగిన గడ్డంమీద చేతులుపెట్టి నిమురుతున్నప్పుడే మీకష్టం ఎంత పెరిగిందో అర్థమైందీ, మిమ్మల్ని నేను ఓదారుస్తున్నానూ..’
`ఆపవయ్యా, ఆపు. నన్ను ఓదార్చడమేమిటీ, నాకేం బాగానే ఉన్నాగా. అయినా ప్రతిపక్షంలో కూర్చుని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టేసి ఇప్పుడేమో నంగనాచిలా నన్ను ఓదారుస్తావా ?’
`చూడండి బాబుగారూ, అది ప్రతిపక్షమూ. అక్కడ అలాగే ఉండాలీ.. కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని ఓదార్చాల్సిందే. నాకు తెలుసూ… మీకు వచ్చిన కష్టం చాలా పెద్దదీ… మీరలా కుర్చీలో కూర్చోండీ, నేను కాసేపు మిమ్మల్ని ఓదార్చివెళ్ళిపోతానూ….’
`చాల్లే ఆపవయ్య, ఇంతకీ నాకేం కష్టమొచ్చిందని….
`అదేమిటీ బాబుగారూ… మీ కష్టం మీకు తెలియకపోయినా మాకు తెలుసూ……. మీరు బకరా అయిపోయారూ… నేను చెబుతున్నానూ… వాళ్లు మిమ్మల్ని మోసం చేశారూ…’
`ఆపవయ్యా నీ దీర్ఘాలూ… ఎందుకలా ప్రతీమాటా సాగదీస్తావూ….ఛీ, ఇదేమిటీ, నీ మాటలు వింటుంటే నాకూ దీర్ఘాలు వస్తున్నాయి. చూడు జగన్, మేము చాలా ముందుకుపోవాలనుకుంటున్నాం. (పక్కన ఉన్నవారివైపు చూస్తూ) అవునా, కాదా తమ్ముళ్లూ మీరు చెప్పండి, అవుననుకుంటే గట్టిగా తప్పట్లు కొట్టండి…’
పక్కనఉన్న తమ్ముళ్లు తప్పట్లు కొట్టారు.
జగన్ మళ్ళీ అందుకున్నాడు.
`బాబుగారూ మీరు ఇలా తప్పట్లు కొట్టించినంతమాత్రాన మీ బాధ తొలిగిపోదూ… నాకు తెలుసూ…. మీకు పెద్ద కష్టమొచ్చిందీ… మీరు ముందుకుపోదామనుకున్నా పోలేని పరిస్థితి వచ్చేసిందీ… నాకు తెలుసూ…’
`అబ్బబ్బా… చూడు జగన్ ఇంతకీ నాకేం కష్టమొచ్చిందని ఓదారుస్తున్నావ్ ? ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో నీలాంటి జీడిపాకం ఓదార్పుగాడ్ని చూడలేదు’
`చూడండీ, మీరు పెద్దవారూ… మంచిగా మాట్లాడటం నేర్చుకోండీ, నన్ను జీడిపాకం ఓదార్పుగాడినంటున్నారు, మరి మీరేమిటో అర్థంచేసుకోండి, వెన్నుపోటుగాళ్లను పట్టించుకోవద్దని మానాన్న చెప్పారూ… మాది ఒకటే పాలసీ. ఎవరు బాధపడుతున్నా వచ్చి ఓదారుస్తాము. ఓదార్పుయాత్రల్లో గిన్నీస్ బుక్కుఎక్కుతామూ… దీన్ని ఎవ్వరూ ఆపలేరూ.. రండీ బాబుగారూ, అలా దూరంగా జరుగకండీ, దగ్గరగా వస్తే కాసేపు ఓదార్చి వెళతాను. నా టైమ్ వేస్టు చేయకండీ, పక్కనే మరో ఓదార్పుయాత్రఉందీ….’
`చేసుకోవయ్యా, ఆ విధంగా నువ్వు ముందుకుపో. నాకెలాంటి అభ్యంతరంలేదు’
`బాబుగారూ.. చూడండీ, నేను అలాగే పోతుంటానూ…అందుకే మీదగ్గరకు వచ్చానూ… మిమ్మల్ని ఓదారుస్తున్నానూ….మీకిప్పుడు కష్టం వచ్చిందీ… కేంద్రంవాళ్లు మిమల్ని పట్టించుకోవడంలేదూ… స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలేదని తెలిసిందీ… మీరు బాధపడుతుంటే చూడలేక ఓదార్చాలని వచ్చానూ…’
`ఓ అదా, ఇవ్వాళకాకపోతే రేపు స్పెషల్ స్టేటస్ వస్తుంది. ఆ నమ్మకం మాకుందీ, అప్పటివరకూ పోరాడతాం. మీ ఓదార్పు మాకు అక్కర్లేదు. ఏమంటారు తమ్ముళ్లూ…’
తమ్ముళ్లు అలవాటైన పద్ధతిలో అవునంటూ తప్పట్లు చరిచారు.
జగన్ మళ్ళీ అందుకున్నాడు.
`సాటిమనిషి కష్టాల్లో ఉంటే ఓదార్చడం మానవధర్మం. మేము ముందునుంచీ చెబుతున్నాము, ఈ ఓదార్పులు, చెంపలు నిమరడాలు, తలమీద చేతులు వెయ్యడాలూ ఆగవు. (ఎదో గుర్తుకువచ్చి) అవును బాబుగారూ, మిమ్మల్ని ఇంకా పూర్తిగా ఓదార్చనేలేదూ… తలమీద చేయి ఇంకా వేయనేలేదూ… రండి దగ్గరగా రండీ, నాచేయి మీతలమీద పెట్టి ఓదారుస్తానూ….’
ఇలా అంటుండగానే బాబుకి భస్మాసురుడు గుర్తుకువచ్చాడు. అంతే పరిగెత్తడం మొదలుపెట్టారు. అలా అలా.. పరిగెత్తుకుంటూ ఇంటిముందు గేటు దగ్గరకు వచ్చేసరికి, అప్పుడే రాహుల్ కారుదిగుతున్నారు. ఎవరో అంటున్నారు – `బాబుగారిని పలకరించడానికి వచ్చారట…’
అంతే అంతటి బాబు నిశ్చేష్టుడయ్యాడు. అంతలో కలచెదిరింది.
– కణ్వస
kanvasa19@gmail.com