ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తెదేపా మద్దతు ప్రకటించడానన్ మంత్రి కె.టి.ఆర్.తప్పు పట్టారు. తెరాస అభ్యర్ధి తుమ్మల నాగేశ్వర రావు నామినేషన్ కార్యక్రమానికి హాజరయిన మంత్రి కె.టి.ఆర్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే, అదే పార్టీకి ఇప్పుడు తెదేపా మద్దతు ఇవ్వడాన్ని ఏమనుకోవాలి? చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ పనికి స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ చాలా క్షోభిస్తుంది,’ అని అన్నారు.
మన దేశంలో రాజకీయ పార్టీలు తమ ఆశయాలను, సిద్ధాంతాలను పక్కన బెట్టి చాలా కాలమే అయ్యింది. అన్నిటికీ అధికారమే లక్ష్యంగా మారింది. అందుకు తెరాస క్కూడా మినహాయింపు కాదని చెప్పడానికి పార్టీ ఫిరాయింపులే చక్కటి నిదర్శనం. దానికి ప్రజలు పూర్తి మెజారిటీ కట్టబెట్టినా కూడా రాష్ట్రంలో తనకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తోంది. లేకుంటే నేడు ఈ ఉపఎన్నికలలో తెదేపా, భాజపాలతో సహా అన్ని పార్టీలు పాల్గొని ఉండేవి. తెరాస పార్టీ అప్రజాస్వామిక విధానం అవలంభిస్తూ, ప్రతిపక్షాలని వేలెత్తి చూపడం అనవసరం. గతః ఏడాది ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు తెరాస పార్టీ తను వ్యతిరేకిస్తున్న వైకాపా మద్దతు తీసుకొనగా తప్పు లేనిది, ఇప్పుడు తెదేపా, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే తప్పేమిటి? అయినా వేరే గత్యంతరం లేకనే మద్దతు ఇవ్వవలసి వస్తోంది తప్ప కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనో అభిమానంతోనో కాదని మంత్రి కె.టి.ఆర్. కి కూడా తెలుసు.