పార్లమెంటు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వ్యవహారం శుక్రవారం నాడు తీవ్ర చర్చనీయాంశం అయింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రెవేటు మెంబరు బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏపీ ఎంపీలు చెలరేగిపోయారు. ప్రత్యేకించి ఏపీకి జరుగుతున్న ద్రోహం గురించి జెడి శీలం ఒక రేంజిలో రెచ్చిపోయారు. తమ సొంత పార్టీకే చెందిన మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ను గద్దించడానికి, ఆయనతో తగాదా పెట్టుకోవడానికి కూడా జెడి శీలం వెనుకంజ వేయలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం.. ఎప్పటిలాగే, ఏపీకి కాంగ్రెసు వల్లనే నష్టం జరిగిందంటూ పాచిపోయిన పాత పాటను పాడింది.
వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై ప్రెవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బిల్లు ఎందుకు పెట్టలేకపోయారో తెలియదు. అయితే బిల్లుపై చర్చ సందర్భంగా.. ఏపీకి జరుగుతున్న అన్యాయం గురించి కేవీపీ ప్రస్తావించారు. ఏపీకి తక్షణం పదేళ్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, బుందేల్‌ఖండ్ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ ఉండాలని, విశాఖ రైల్వేజోన్, పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం నిధులు ఇవ్వడం తదితర అంశాలను కేవీపీ ప్రస్తావించారు. ఆ తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జెడి శీలం మరింత తీవ్రస్వరంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న కష్టాలను నివేదించారు. హోదా గురించి విభజన బిల్లు సమయంలో చర్చ జరిగినప్పుడు.. ఐదేళ్లు చాలదు, పదేళ్లు ఇవ్వాల్సిందే.. మేం అధికారంలోకి రాబోతున్నాం ఆంధ్రను ఆదుకుంటాం అని చెప్పిన వెంకయ్యనాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న వంచనను ఆయన చాలా గట్టిగా ప్రస్తావించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటిదాకా ఏమీ సాయం అందించలేదని కూడా నిలదీశారు. ఒక దశలో అప్పట్లో విభజన సమయంలో కీలకంగా చక్రం తిప్పిన కాంగ్రెస్ మాజీ మంత్రి జైరాం రమేష్ జోక్యం చేసుకోబోగా, మీకేం తెలుసు మాకష్టాలు అంటూ తీవ్రస్వరంతో జేడీ శీలం ఆయనతో తగాదా పెట్టుకోవడం విశేషం. మరో కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి తన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం సభకు రాలేదు.
పెట్టింది ప్రెవేటు బిల్లే అయినప్పటికీ.. చర్చలో మాట్లాడిన తెదేపా ఎంపీ సీఎం రమేష్ మాత్రం కాంగ్రెసు మీద నిందలు వేయడానికి పాతపాట పాడడం దారుణం. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న వంచనను ప్రస్తావించకుండా కాంగ్రెస్ వల్లనే విభజన కష్టాలు వచ్చాయంటూ ఆయన చర్చలో ఏపీ తరఫు పోరాటాన్ని పలుచన చేసేశారు.
అయితే దారుణమైన విషయం ఏంటంటే.. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రవేశపెట్టిన బిల్లు మీద ఎంత తీవ్రమైన చర్చ జరిగినప్పటికీ ఉపయోగం లేకుండాపోయింది. సభలో కోరం లేకపోవడంతో బిల్లుపై ఓటింగ్ జరగలేదు. సభ్యులందరినీ లెక్కవేసిన తర్వాత.. కోరం లేదని తేలడంతో.. ఈ బిల్లు మీద తదుపరి చర్చ, ఓటింగ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. ఆ రకంగా కేవీపీ , జెడీశీలం చేసిన ప్రయత్నం ఇవాళ ఒక కొలిక్కి రాకుండా వృథా అయింది.