మెడికల్ సీటు సాధించడానికి రకరకాల పోటీ పరీక్షల స్ధానంలో ఒకే ఒక్క ‘నీట్’- నేషనల్ ఎలిజబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించవలసిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు పై విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో గందరగోళం తలఎత్తింది. అయితే ఎన్ టిఆర్ హెల్త్ యూనివర్సిటీ ముందుగానే నిర్ణయించిన విధంగా ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ జరిగిపోయింది.
దేశవ్యాప్తంగా 458 మెడికల్ కాలేజీలలో 52 వేల సీట్లకోసం ఏటా దాదాపు 26 ఎంట్రెన్స్ టెస్టులద్వారా పదిహేను లక్షల మంది పోటీ పడుతూంటారు. ఇంటర్మీడియట్ లేదా టెన్ ప్లస్ టూ మార్కుల ప్రాతిపదికగా ఆయా రాష్ట్రాలు,విశ్వవిద్యాలయాలు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
ఇన్నిన్ని పరీక్షలు లేకుండా దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం వుండాలన్న ఆలోచన నుంచే నీట్ పుట్టుకొచ్చింది. ”నీట్” ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఆ పరీక్షకు ప్రాతిపదికగా తీసుకున్న సి బి ఎస్ ఇ – సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిలబస్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ పాటించడం లేదు. ప్రతి రాష్ట్రంలోనూ కొద్దిపాటి విద్యాసంస్ధల్లో సెంట్రల్ సిలబస్ వున్నప్పటికీ అత్యధిక సంఖ్యలో విద్యా సంస్ధలు ఆయా రాష్ట్రానికీ సొంత ప్లస్ టూ సిలబస్ నే బోధిస్తున్నాయి. ఈ నేపధ్యంలో నీట్ పరీక్ష వల్ల ప్రతీ రాష్ట్రంలోనూ చెదురు మదురుగా వున్న వేలమంది సెంట్రల్ సిలబస్ విద్యార్ధులకు కలిగే ప్రయోజనం ప్రతి రాష్ట్రంలోనూ ఆయా స్టేట్ సిలబస్ లు పాటించే లక్షల మంది కి వుండదు.
ఇందువల్లే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఉత్తరప్రదేశ్ మొదలైన రాష్ట్రాలు నీట్ వద్దన్న అభ్యంతరాన్ని కోర్టులో దాఖలు చేశాయి. ఏ విధమైన ప్రవేశపరీక్షా లేకుండా ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్ ద్వారానే ఎంబిబిఎస్ సీట్లు నింపుతున్న తమిళనాడు తనకు ఏవిధమైన నీట్ అవసరం లేదని వివరించింది.
ముల్కీ నిబంధనల వల్ల కోస్తాంధ్ర, తెలంగాణా, రాయల సీమ ప్రాంతాల వారికి రాజ్యాంగంలోని 371 డి ఆర్టికల్ కింద సీట్లు కేటాయించవలసి వున్నందున జాతీయ స్ధాయి పరీక్ష కూడా నిర్వహిస్తే మరి కొన్ని సీట్లు కోల్పోయి స్ధానిక విద్యార్ధులు నష్టపోతారని విభజనకు ముందే ఆంధ్రప్రదేశ్ వాదించింది. రాష్ట్రం ఎపి, తెలంగాణాగా విడిపోయాక కూడా 371 డి ఆర్టికల్ రద్దు కాలేదు. ఇందువల్ల తెలుగు రాష్ట్రాలు రెండింటికీ లోకల్, నాన్ లోకల్ రిజర్వేషన్లు వున్నాయి. ఇపుడు నీట్ వచ్చిపడితే స్ధానిక విద్యార్ధులు నష్టపోతారు.
దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం వల్ల విద్యార్ధులకు వత్తిడి తగ్గుతుంది. కానీ, ఇందుకు ముందుగా దేశమంతటా ఒకే సిలబస్ అమలులోకి రావాలి. ఆ సిలబస్ అమలు చేయడం మొదలు పెట్టాక మూడో సంవత్సరం నుంచీ నీట్ పరీక్ష నిర్వహిస్తూ వుండటం వల్ల అందరికీ సమాన అవకాశాలు వస్తాయి. లేని పక్షంలో డాక్టర్ల కొరత తీవ్రంగా వున్న గ్రామీణుల అవకాశాలను ప్రధానంగా సెంట్రల్ సిలబస్ లో చదువుకునే పట్టణ ప్రాంతాల వారే చేజిక్కించుకునే అవకాశం ఏర్పడుతుంది.
కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – నీట్ పరీక్షగురించి ప్రకటించినపుడు సుప్రీం కోర్టులో దాఖలైన అభ్యంతరం మూగ్గురు న్యాయమూర్తుల బెంచి కి వెళ్ళింది. నీట్ అవసరం లేదని ఇద్దరు జడ్జిలు, అవసరమేనని దవే అనే జడ్జి అభిప్రాయపడ్డారు. మెజారిటీ నిర్ణయం ప్రకారమే తీర్పు వెలువడింది.
ఆతీర్పు వచ్చిన రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైరౌతున్నందువల్ల ముగ్గురు జడ్జిల మధ్య చర్చ జరగకుండానే తీర్పు ఇచ్చేశారని ఇందువల్ల కేసు పునర్విచారణ జరగాలనీ దాఖలైన పిటీషన్ ఐదుగురు జడ్జిలు వున్న బెంచ్ మీదికి వచ్చింది. ఈ బెంచిలో పాత తీర్పుని వ్యతిరేకించిన దవే సీనియర్ జడ్జిగా వున్నారు. ఆయన పాత అభీష్టమూ, కొత్తతీర్పూ ఒకటే!
అప్పట్లో చర్చ జరగకుండానే తీర్పు వచ్చినట్లుగానే అప్పుడే అభ్యంతరాలు వెలిబుచ్చిన తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల వాదనలను ఈ సారి పరిగణనలోకి తీసుకోలేదు. కేసులో ఈ రాష్ట్రాలు ప్రతివాదులు కావనీ, అవసరమైతే వాటి వాదనలను కూడా తరువాత వింటామనీ తీర్పులో స్పష్టం చేసేశారు. నీట్ షెడ్యూలు కూడా ఖరారు చేసేశారు. పరీక్షలు నిర్వహించేశాక వాదనలు వినడం వల్ల ప్రయోజనమేమిటో విద్యార్ధులకూ తల్లిదండ్రులకూ అర్ధం కాని విషయం!
సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఇలాంటి గందరగోళం తల ఎత్తినప్పటికీ శుక్రవారం యధావిధిగా ఎంసెట్ పరీక్ష జరిగిపోయింది. కోర్టు అంతిమ నిర్ణయానికి లోబడే అడ్మిషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.