ఇవిగో ఆధారాలు…
మొన్నీమధ్యనే పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పై దాడికి తెగబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చారని ఆ దేశం ఒప్పుకోకపోవచ్చేమోకానీ, అందుకుతగ్గ బలమైన ఆధారాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయన్నది నిజం. దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడిజరిపిన ముగ్గురు టెర్రరిస్టులు ఆ తర్వాత జరిగిన ఎన్ కౌంటర్ లో మృతిచెందారు. వీరు దాడిజరిపిన ప్రాంతం భారత- పాక్ సరిహద్దుకు దగ్గర్లోఉంది. దీంతో దాడిజరిపిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే రాత్రికిరాత్రి సరిహద్దులుదాటి భారతభూభాగంలోకి ప్రవేశించి ఉంటారన్న అనుమానాలకు ప్రాధమిక సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. దాడిజరిపిన ఉగ్రవాదులు వాడిన గ్లో (చేతి తొడుగు)లపై `మేడ్ ఇన్ పాకిస్తాన్’ అన్నట్యాగ్స్ కనిపించాయని విచారణ అధికారులు చెప్పారు. అంతేకాదు, అమెరికాలో తయారైన నైట్ విజన్ డివైజ్ ని ఆప్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చినట్టు ఆధారాలు లభించాయి.
ఎన్ కౌంటర్ లో మృతిచెందిన ఉగ్రవాదుల మృతదేహాలను గురుదాస్ పూర్ సివిల్ ఆస్పత్రి డాక్టర్లు శవపరీక్షలు నిర్వహించారు. వారు అందించిన నివేదికలో తమ వద్దకు మృతదేహాలు వచ్చినప్పుడు వారిలో ఒకరు వాడిన చేతితొడుగు మీద `మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని ఉన్నట్టు బాహ్యపరిశీలన నివేదికలో డాక్టర్లు వెల్లడించినట్టు పోలీసువర్గాలు వెల్లడించాయి.
పాకిస్తాన్ నుంచే ఉగ్రవాదులు మనదేశంలోకి జొరబడ్డారనడానికి ఇది ప్రబల సాక్ష్యమని పోలీసు వర్గాలు చండీగడ్ లోని హిందూస్తాన్ టైమ్స్ వార్తాపత్రికకు తెలియజేశారు.
ఎన్ కౌంటర్ ఆపరేషన్ పూర్తికాగానే అప్పటికప్పుడు పోలీసులు మృతదేహాలను, వారిచెంత ఉన్న వస్తువులను తనిఖీ చేశారు. కొన్నింటిని స్వాధీనంచేసుకున్నారు. అయితే ఈ ` గ్లో’ ఎక్కడతయారైందన్న విషయం వారప్పుడు గమనించలేదు. ఇదిఇలాఉంటే, నైట్ విజన్ డివైజ్ ఆధారంగా మరికొంత సమాచారం సేకరించగలిగారు. రాత్రిపూట దారిచూపే ఈ పరికరంమీద ముద్రితమైన ప్రత్యేక సంఖ్య ఆధారంగా ఈ పరికరాన్ని ఆఫ్ఘనిస్తాన్ సాయుధదళాల నుంచి సేకరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఇది అమెరికాలో తయారైంది. అమెరికా అనేక దేశాలకు యుద్ధసామాగ్రి అమ్ముతున్నవిషయం బహిరంగ రహస్యమే. అయితే ఈ పరికరం ఈ టెర్రరిస్టుల చేతికి ఎలా చేరిందన్నది విచారణలో తేలాల్సిఉంది. అంతేకాదు, ఉగ్రవాదులు ఈ దాడిసందర్భంగా వాడిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ (జీపీఎస్) సెట్స్ , అలాగే, రాకెట్ ప్రొపెల్లెడ్ గ్రెనేడ్ లాంచర్ కు సంబంధించిన పూర్తివివరాలపై పోలీసులు దృష్టిపెట్టారు. రాకెట్ లాంచర్ ని ఉంచిన పొజిషన్ చూస్తుంటే ఉగ్రవాదులు తమ ఆఖరిదాడికి అవకాశంగా దీన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోందని పోలీస్ అధికారులు చెబుతున్నారు. జీపీఎస్ ద్వారా గురుదాస్ పూర్ సిటీకి మార్గాన్ని గమనించడాన్నిబట్టి చూస్తుంటే వారు ఈ సిటీపై దాడికి కూడా వ్యూహం పన్నిఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఈదాడికి తెగించిన ముష్కరులు `మేడ్ ఇన్ పాకిస్తాన్’ అన్నది ఈ ఆధారాలు చెప్పకనేచెబుతున్నాయి.
మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఆధారాలపట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.
– కణ్వస