బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తనమీద దాఖలు అయిన అన్ని రకాల నేరారోపణలకు సంబంధించి నిర్దోషి అని న్యాయస్థానం దృష్టిలో తేల్చబడి ఉండవచ్చు గాక… కానీ జాతి మాత్రం ఆయనను ఇంకా సచ్ఛీలుడిగా చూడలేకపోతోంది. భారత దేశం తరఫున ఆయనకు గౌరవం కట్టబెట్టడాన్ని ఎవ్వరూ సహించలేకపోతున్నారు. ఈ జాతికి ప్రతినిధిగా ఆయనను ఎంపిక చేయడాన్ని ఏమాత్రం జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలు బహుశా ఈ కండల వీరుడికి ఖచ్చితంగా అవమానకరమైనవే అనిపించవచ్చు. కానీ.. వాస్తవంగా, కోర్టులు మాత్రమే తప్ప జాతి యావత్తూ తనను మన్నించే వరకూ ఆయన నిరీక్షించవలసిందే.
సల్మాన్‌ఖాన్ దీనిని సీరియస్‌గా తీసుకున్నట్లు చెప్పకపోయినప్పటికీ.. ఆయనకు మనస్తాపం కలిగించగల సంఘటన ఇది. 2016 రియో ఒలింపిక్స్‌కు సల్మాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక చేయాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తొలుత భావించింది. అంతర్జాతీయంగా ఈ సినిమా హీరోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయనకు ఈ హోదా తగినదే అని అనుకోవచ్చు. కానీ, దేశవ్యాప్తంగా అనేక మంది ఈ నిర్ణయాన్ని నిరసించారు. సల్మాన్ చుట్టూ అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తిని గుడ్ విల్ అంబాసిడర్ చేస్తారా? అంటూ ఐఓఏ తీరును ఈసడించారు. దీంతో ఆ ఒత్తిడికి తలొగ్గి అసోసియేషన్ తమ నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. ఈ హోదా కోసం అభినవ్ బింద్రాను వారు ఎంపిక చేసుకున్నారు. ఇది చిన్న విషయమే అనిపించవచ్చు. కానీ సినిమాలు సూపర్‌హిట్ అవుతున్నంత మాత్రాన సల్మాన్‌ను జాతి ఇంకా సచ్ఛీలుడిగా గుర్తించడం లేదని మనం తెలుసుకోవాలి.