కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి ఆరోపణలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో సోనియా గాంధీకి ముడుపులు ముట్టినట్టు ఇటలీ కోర్టు కూడా పేర్కొందని బుధవారం నాడు స్వామి రాజ్యసభలోనే ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఈ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు డిప్యుటీ చైర్మన్ కురియన్ ప్రకటించారు.
తాజాగా స్వామి మరో ఆరోపణ చేశారు. చోపర్ స్కాములో తీసుకున్న లంచం సొమ్మును సోనియా ఎక్కడ దాచారో తెలుసంటూ మరో ఆరోపణ చేశారు. ఓ చానల్ కు ఇంటర్ వ్యూ ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెనీవా లోని సరాసిన్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారని స్వామి ఆరోపించారు. అలాగే, పిక్టెట్ బ్యాంకులో కూడా కొంత సొమ్ము దాచారన్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరో్పణ. వందేళ్లు పైబడిన పార్టీ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న సోనియాపై స్వామి చేసిన ఆరోపణ సామాన్యమైంది కాదు.
ఒక వేళ స్వామి ఆరోపణ నిజమైతే దేశ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఈ ఆరోపణలు అబద్ధమైతే ఆమె పరవుకు తీవ్రంగా భంగం కలిగించినట్టు అవుతుంది. ఇంతకీ ఆయన నిజాలు బయటపెట్టారా లేక ఆమె పరువుకు భంగం కలిగించే ఆరోపణలు చేశారా అనేది తేలాల్సి ఉంది.
అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో ఫిన్ మెకానికా మాజీ సిఇఒకు ఇటలీలో నాలుగున్నరేళ్ల జైలు శిక్ష పడింది. హెలికాప్టర్ డీల్ కోసం భారత్ లో కొందరికి లంచాలు ఇచ్చిన వారికి ఇటలీలో శిక్ష పడింది. మరి లంచాలు తీసుకున్న వారి సంగతేంటి? మన దేశంలో ఎవరెవరు లంచాలు తీసుకున్నారనేది తేలాల్సి ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. మరి ఈ రెండేళ్లలో ఈ వాస్తవాన్ని వెలికితీసే ప్రయత్నం సరిగ్గా జరిగిందా లేదా కూడా తెలియాల్సి ఉంది.
ఇటలీలోని మిలన్ అప్పీల్ కోర్టు తీర్పు మొత్తం 225 పేజీలుంది. అందులో సైనోరా గాంధీ అనే పేరుందనేది మరో ఆరోపణ. ఇటలీ భాషలో శ్రీమతి అనే మాటను సైనోరా అంటారట. అంటే శ్రీమతి గాంధీ అనే పేరు ఆ తీర్పులో ఉందనేది తీవ్రమైన ఆరోపణ. అలాగే, భారత్ లోని కొందరు రాజకీయ నాయకులకు 125 కోట్ల రూపాయల లంచాలు ముట్టాయని కూడా మిలన్ కోర్టు ప్రస్తావించిందని అంటున్నారు.
సుబ్రమణ్యం స్వామి చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత అనేది కచ్చితంగా దేశ ప్రజలకు తెలియాలి. తాను ఎవరికీ భయపడేది లేదని సోనియా గాంధీ అన్నారు. ఆమె భయం ఇక్కడ విషయం కాదు. లంచాలు తీసుకున్న వార ఎవరో తెలియాలి. అప్పట్లో యూపీఏ అధికారంలో ఉంది. ఇటలీ కోర్టు తీర్పులో శ్రీమతి గాంధీతో పాటు మన్మోహన్ సింగ్, ఆస్కార్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్ ల పేర్లు కూడా ఉన్నాయనేది నిజమా కాదా లేని కూడా వీలైనంత త్వరగా ప్రజలు తెలియాలి.
కేంద్ర ప్రభుత్వం వేగంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి నిజాన్ని నిగ్గుతేల్చాలి. ఇందులో రాజకీయాలకు తావు లేదు. దేశ ప్రయోజనమే ముఖ్యంగా దర్యాప్తు త్వరగా జరుగుతుందని, నిజాలు బయటకు వస్తాయని ఆశిద్దాం.