పాలేరు ఉప ఎన్నికలో గెలుపు నల్లేరు మీద నడక కావాలని తెరాస వ్యూహాలు పన్నుతోంది. ఖమ్మం ప్లీనరీతో కేడర్ కు ఫుల్ జోష్ వచ్చింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం ఖాయమా లేక కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా అనేదే హాట్ టాపిక్.
పాలేరు సీటు కాంగ్రెస్ కు కంచుకోట. అయితే ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం అనే కళలో ఆరితేరిన తెరాసను ఎదుర్కొని గెలవడమే గట్టి సవాల్. తెరాస హామీలు, వ్యూహాలు ఎన్నికల్లో ఎదురులేకుండా చేస్తున్నాయి. తిరుగులేని విజయాలు అందిస్తున్నాయి. ఇప్పుడు పాలేరులో కాంగ్రెస్ జోరుకు బ్రేక్ వేసే పరిణామం కూడా ఆశ్చర్యకరమే, అదే.. ఉప ఎన్నికలో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయించడం.
తోటి వామపక్షం సీపీఐ మాత్రం కాంగ్రెస్ కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తున్న తెరాసకు జలక్ ఇవ్వాలని సీపీఐ, టీడీపీ నిర్ణయించాయి. వైసీపీ కూడా పోటీకి దూరంగా ఉంది. బీజేపీ సైతం పోటీకి దూరంగా ఉంది. అయితే కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించలేదు. అయినా, ఆ పార్టీ ఓటర్లు కాంగ్రెస్ కే ఓటు వేస్తే హస్తానికి అదనపు బలం అవుతుంది.
తెలంగాణలో ప్రతిక్షాలను పద్ధతి ప్రకారం దెబ్బతీస్తున్న తెరాసపై పలు పార్టీలు గుర్రుగా ఉన్నాయి. ఏ మాయ చేస్తోందో గానీ ప్రతి ఎన్నికల్లో ఎవరూ ఊహించనంత ఘన విజయాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంటోంది. స్వతహాగా కేడర్ బలం లేని పాలేరులో మాత్రం జలక్ ఇవ్వాలని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దీనికి సీపీఎం నిర్ణయం విఘాతం కలిగిస్తుందని ఆ పార్టీలు విమర్శిస్తున్నాయి.
తనకంటూ గ్యారంటీ ఓటు బ్యాంకు ఉన్న సీపీఎం పోటీలో ఉండటం అంటే, తెరాస నెత్తిన పాలు పోయడమేనంటున్నారు విశ్లేషకులు. ఇది పరోక్షంగా కారు జోరుగా విజయ పథంలో దూసుకు పోవడానికి ఉపయోగ పడవచ్చని అంచనా వేస్తున్నారు. అసలు తెరాసకు తిరుగులేని విజయాన్ని అందించే వ్యూహంగా భాగంగానే సీపీఎం బరిలోకి దిగిందనే ప్రచారం కూడా జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ సంచలన విజయాలకు కారణం సీపీఎం పరోక్ష సహకారం అనే ఊహాగానాలు, విమర్శలు వచ్చాయి. ఖమ్మంలో సీపీఐ ఓటమికి, వైపీసీ విజయానికి ప్రధాన కారణం సీపీఎం తెరచాటు రాజకీయాలే అని తోటి కామ్రేడ్లు దుయ్యబట్టారు.
ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేసే వ్యూహంలో సీపీఎం పావుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి జలక్ ఇవ్వాలనే ప్రతిపక్షాలతో చేతులు కలపకుండా తెరాసకు మేలు చేయడానికి పూనుకోవడం దారుణమని కాంగ్రెస్, సీపీఐ ఇతర పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. సీపీఎం మాత్రం తన నిర్ణయం తనదేనని, తాను ఎవరి చేతిలో పావును కాదని వాదిస్తోంది. మొత్తానికి, గులాబీ గుభాళించడానికి మార్గం సుగమం అయిందనే ప్రచారం నిజమవుతుందో లేదో చూద్దాం.