పాలేరు ఎన్నికల ప్రచార పర్వంలో వెరైటీ రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మొత్తానికి 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటికీ.. పోటీ ప్రధానంగా మరణించిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి భార్య సుచరిత, తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మధ్య మాత్రమే ఉంటుందనడంలో సందేహం లేదు. కాకపోతే వామపక్షాల అభ్యర్థి కూడా బలంగానే రంగంలో ఉన్నారు. మిగిలిన వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులే. మరోవైపు తెదేపా, వైకాపా పార్టీలు , కాంగ్రెస్ అభ్యర్థి సుచరితకు మానవతా దృక్పథంతో మద్దతు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తెదేపా, వైకాపాల మద్దతు నుంచి పూర్తిస్థాయిలో మైలేజీ సాధించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరిత రెడ్డి సంకల్పిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అసలే ఆ పార్టీలు తమ మద్దతు ప్రకటించినప్పటికీ.. వాస్తవంగా ప్రచార పర్వంలో కూడా కాంగ్రెస్ వెంట నిలుస్తాయా? లేదా ప్రకటనలకు పరిమితం అవుతాయా అనేదానిపై ఇప్పటికే ఊహాగానాలు నడుస్తున్నాయి. వారు అలా చేస్తే కుదరదని, తెరాసను ఓడించడానికి ప్రచారానికి కూడా రావాలని కాంగ్రెస్ నాయకులు పుల్లవిరుపు మాటలు అంటూ ఉన్నారు కూడా!
ఆ పార్టీల వైఖరి ఎలా ఉన్నా.. వారి మద్దతు తనకే ఉన్నదనే అంశాన్ని ప్రముఖంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా … వీలైనంతవరకు ఆ పార్టీల ఓట్లు జారిపోకుండా రాబట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లుంది. వారు రిలీజ్చేసిన ప్రచార పోస్టరే ఇందుకు ఉదాహరణ. కాంగ్రెస్ అభ్యర్థి పోస్టరుపై సోనియా, రాహుల్ ల బొమ్మలకంటె కాస్తంత పెద్ద సైజులో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, జగన్ ఫోటోలను కూడా వారు ముద్రించారు. దానికి తోడు.. అభ్యర్థి సుచరిత ఫోటోను వేసినంత ప్రముఖంగా.. తెలుగుదేశానికి చెందిన ఖమ్మం నాయకుడు నామా నాగేశ్వరరావు, వైకాపా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల నిలువెత్తు ఫోటోలను కూడా ఈ పోస్టరుపై వేశారు. ఆ పార్టీల ఓట్లు మిస్‌కాకుండా వస్తాయనేది వారి ఆలోచన కావచ్చు. అయితే నామా, పొంగులేటిలను నేరుగా ఎన్నికల ప్రచారసభలకు కూడా తీసుకువస్తారో ఏమో అని జనం అనుకుంటున్నారు.