పాలక పార్టీలతో స్నేహసంబంధాలు మెయింటైన్ చేయడం అనేది ఒక ఆర్టు. అది అందరికీ అబ్బే విద్య కాదు! మన టాలీవుడ్ సినీ హీరోలు, ప్రముఖుల విషయానికి వస్తే.. ఆ విషయంలో హీరో నాగార్జున తల పండిపోయిన అనుభవజ్ఞుడే అని చెప్పాలి. రాష్ట్రంలో అప్పట్లో చంద్రబాబునాయుడు తెలుగుదేశం సర్కారు ఉన్నా వారి హవా బాగానే నడిచింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే.. నాగార్జున ఏకంగా ఆ ప్రభుత్వానికి అప్రకటిత బ్రాండ్ అంబాసిడర్‌లాగా ప్రచారాలు అనేకం నిర్వహిస్తూ వచ్చారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో కూడా చాలా సన్నిహితంగానే ఉన్నారు. తీరా రాష్ట్రం విడిపోయి తెలంగాణ సర్కారు ఏర్పడినప్పటికీ నాగార్జునకుమాత్రం హవా బాగానే నడుస్తున్నది. వివాదాస్పదం అయిన ఆయన మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌కు అనుమతులు అన్నీ వచ్చేశాయి. ఇప్పుడు ఆయన శ్రీమతి అమల అక్కినేనికి కేసీఆర్ ప్రభుత్వం ఓ అధికారిక పదవిని కూడా ఇచ్చింది.
తాజాగా అక్కినేని అమలను తెలంగాణ రాష్ట్ర జంతు సంక్షేమ మండలిలో సభ్యురాలిగా ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ మండలికి రాష్ట్ర పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అధికారులు కాకుండా, ఏడుగురు బయటి వారు నామినేటెడ్ సభ్యులుగా ఉంటారు. వారిలో అమల కూడా ఒకరు.
అక్కినేని అమల బ్లూక్రాస్ సంస్థ ద్వారా జంతు సంరక్షణ కోసం విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా షూటింగుల్లో జంతువుల వినియోగం, వాటిని హింసించడం ఇలాంటి విషయాలపై అమల పోరాడి, ఏకంగా చట్టాల్లో మార్పులు వచ్చేలాగానూ కృషిచేశారు. అలాంటి అమలకు జంతు సంరక్షణ మండలిలో సభ్యురాలిగా పదవి దక్కడం సబబే అని పలువురు భావిస్తున్నారు.