ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం మరో పెద్ద కార్యక్రమం భుజానికెత్తుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపుల జనాభా, వారి ఆర్ధిక, సామాజిక స్థితిగతుల గురించి విద్యార్ధుల సహాయంతో సర్వే చేపట్టాలని నిర్ణయించుకొన్నారు. తద్వారా కాపుల వాస్తవ పరిస్థితిని అర్ధం చేసుకొని తదనుగుణంగా ప్రణాళికలు రచించుకొని కార్యాచరణకి దిగవచ్చని ఆయన భావిస్తున్నారు. తాను సేకరించిన ఆ వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ మంజూనాద కమీషన్ కి కూడా నివేదించి, కాపులను కూడా బీసిలలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని గట్టిగ నొక్కి చెప్పడానికి పనికివస్తుందని ముద్రగడ భావిస్తున్నారు.
ముద్రగడ తలపెట్టిన ఈ కార్యక్రమం చాలా మంచిదే. దాని వలన ఆయనకే కాకుండా ప్రభుత్వానికి కూడా చాలా అవసరమయిన సమాచారం లభిస్తుంది. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మంజునాధ కమీషన్ కి కూడా అది చాలా ఉపయోగపడుతుంది.
“కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడే ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చారు కనుక దానినే అమలుచేయమని కోరుతున్నాము తప్ప కొత్తగా ఏమీ కోరడం లేదని ముద్రగడ అన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకొంటే మంచిదే లేకుంటే మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టక తప్పదని” ముద్రగడ హెచ్చరించారు.
ఆంధ్రాలో కాపులకు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాడుతున్నట్లే గుజరాత్ లో హార్దిక పటేల్ తన పటేల్ కులస్తుల కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటానికి తలొగ్గి ఆర్ధికంగా వెనుకబడి ఉన్న పటేల్ కులస్తులకు విద్యా, ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. వచ్చే ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికలున్నాయి కనుక రాష్ట్రంలో రాజకీయ, ఆర్ధిక, వ్యాపార రంగాలను శాశిస్తున్న పటేల్ కులస్థులకు ఆగ్రహానికి గురి కాకూడదనె ఉద్దేశ్యంతోనే గుజరాత్ ప్రభుత్వం వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఆంధ్రాలో కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే ఉన్నాయి కనుక కాపులకు రిజర్వేషన్లు కల్పించడం అనివారయమ అవవచ్చు. అందుకే తమ పోరాటం కూడా విజయవంతం అవుతుందని ముద్రగడ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.