తెలంగాణా ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకాలను నిరసిస్తూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మే 16,17,18 తేదీలలో నిరాహార దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లోని తన పార్టీ కార్యాలయం లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యి చర్చించిన తరువాత ఈవిషయం ప్రకటించారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఎగువనున్న తెలంగాణా రాష్ట్రంలో పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉలకరు పలకరు. పైన ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు తోడేసుకొంటుంటే, దిగువనున్న మనం ఏమయిపోవాలి? వాటి వలన కృష్ణా జిల్లాయే కాదు తెలంగాణాలో ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కూడా నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఓటుకి నోటు కేసుని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ తిరగదోడుతారో అనే భయంతో చంద్రబాబు నాయుడు అయన ఏమి చేస్తున్నా చూస్తూ ఊరుకొంటున్నారు. దాని వలన రాష్ట్ర ప్రజలు నష్టపోవలసి వస్తోంది. మహబూబ్ నగర్ నుంచి క్రిందకు నీళ్ళు వస్తేనే శ్రీశైలం జలాశయం నిండుతుంది. ఆ తరువాత నాగార్జునసాగర్ నిండుతుంది. కానీ తెలంగాణా ప్రభుత్వం ఎగువన మహబూబ్ నగర్, డిండి ఎత్తిపోతల పధకాలు పెట్టి నీళ్ళు తోడేసుకొంటే, దిగువనున్న మన పరిస్థితి ఏమిటి? అనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం చాలా విచారకరం. అందుకే నేనే పూనుకొని కర్నూలులో మూడు రోజులు నిరాహార దీక్ష చేయాలనుకొంటున్నాను. కనీసం అప్పటికాయినా, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, కేంద్రప్రభుత్వంలో దీనిపై కదలిక వస్తుందని నేను ఆశిస్తున్నాను,” అని జగన్ అన్నారు.
ఈ విషయంలో జగన్ చెపుతున్న మాటలు నూటికి నూరు శాతం నిజమేనని చెప్పవచ్చు. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తే దిగువన తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రాలు ఏవిధంగా నీటి కొరతని ఎదుర్కొంటున్నాయో, ఇప్పుడు ఆంధ్రాకి ఎగువనున్న తెలంగాణాలో ప్రాజెక్టుల వలన కూడా ఆంధ్రాకి అటువంటి సమస్యే ఎదురవుతుంది. ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియదనుకోలేము. అయినా ఇంతవరకు ఆయన తెలంగాణాలో నిర్మితమవుతున్న ఆ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం లేదు. కనుక జగన్ చెప్పిన కారణం చేతనే ఆయన మౌనం వహిస్తున్నట్లు అనుమానించక తప్పదు. పట్టిసీమ ద్వారా రాయలసీమకి నీళ్ళు అందించి సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్న తెదేపా ప్రభుత్వం, ఎగువనున్న తెలంగాణా నుంచి క్రిందకు నీళ్ళేరాని పరిస్థితి ఎదురవుతుంటే మౌనం వహించడం చాల శోచనీయం.
ఈవిషయంలో జగన్ చిత్తశుద్ధిని కూడా అనుమానించక తప్పదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ లో ఉంటూ, తెరాసతో అవగాహన కలిగి ఉన్నప్పటికీ, నేరుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి తన అభ్యంతరాలు తెలియజేసి ఉండి ఉంటే బాగుండేది. కానీ అక్కడ తెరాసతో సంబంధాలు దెబ్బ తింటాయనే భయం. అలాగే దీక్ష విషయం ప్రకటించక మునుపే ఆయన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి దీని గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ అందుకు అహం అడ్డువస్తోంది.
రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటున్న జగన్మోహన్ రెడ్డి, ముందు వారిరువురిని కలిసి మాట్లాడి వారి స్పందన చూసిన తరువాత ఆయన ఈ దీక్షా కార్యక్రమం పెట్టుకొని ఉండి ఉంటే నమ్మశక్యంగా ఉండేది. కానీ ఆవిధంగా చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించేసి, వైకాపాని అందుకు సన్నధం చేయడం గమనిస్తే ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇదివరకు కూడా అయన రాజధాని రైతుల కోసం, ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేసారు కానీ ఆ తరువాత మళ్ళీ వాటి ఊసే ఎత్తడంలేదు. అంటే ఆ సమస్యలన్నీ పరిష్కరం అయిపోయాయనుకోవాలా లేకపోతే సమస్యల గురించి మొక్కుబడిగా మూడు రోజులు దీక్షలు చేస్తే చాలని భావిస్తున్నారో ఆయనకే తెలియాలి. కనుక ఈ దీక్ష కూడా ఆ కోవకే చెందుతుందేమోనని అనుమానించవలసి వస్తోంది.