పవన్ కళ్యాణ్ మళ్ళీ తెర మీదకు వచ్చారు. అలా అనగానే ఆయనేదో ప్రశ్నించడం మొదలు పెట్టేసారేమో అని గానీ, పోరాటానికి రోడ్డు మీదకు వచ్చారని గానీ ఎవరైనా అనుకుంటే పొరబాటు. అలవాటు ప్రకారం అయన తన తాజా ట్వీట్ ద్వారా మాత్రమే వార్తల్లోకి వచ్చారు. కాకపోతే ఈ దఫా ప్రత్యేక హోదాకు సంబంధించిన ట్వీట్ ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఒకింత ఆగ్రహాన్ని అయన వ్యక్తం చేసారేమో అని అనుకోవాల్సి వస్తోంది. బీజేపీ మీద తన మనస్తాపాన్ని అయన చాలా సున్నితంగా ఆ ట్వీట్ లో వెలిబుచ్చారు. పనిలో పనిగా బాధ్యతను మళ్ళీ అధికార పార్టీ ఎంపీల మీదకు నెత్తివేయడానికి ఆయన ప్రయత్నించారు.
వివరాల్లోకి వెళితే…
చాలాకాలం గ్యాప్ తరవాత పవన్ కళ్యాణ్ శనివారం నాడు రెండు ట్వీట్ లు పెట్టారు. అందులోని సందేశం ఇదే.
“సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని, పార్లమెంటు లో బయటకు గెంటి, ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి, కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైన తప్పు చేసింది. ఆరోజు సీమాంధ్ర ప్రజలకు జరిగిన అవమానం ఎవరు మరచిపోలేదు.. మరచిపోరు కూడా..
ఈరోజు ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట మీద వెనక్కి తగ్గి, సీమాంధ్ర ప్రజల నమ్మకం మీద కొట్టి, బీజేపీ కూడా అలాంటి తప్పు వైపే అడుగులు వెయ్యకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్ల మీదికొచ్చి ఉద్యమించే లోపే అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పార్లమెంటు లో దీనిమీద పోరాటం చెయ్యాలని సీమాంధ్ర ప్రజల తరపున నా విన్నపం”
.. ఇదీ ఆయన ట్వీట్.
అయితే, అయన అధికార పార్టీ ఎంపీలకు తను దిశానిర్దేశం చేయడం తప్ప, స్వయంగా తను ఏమి చేస్తాడో ఇప్పటికీ చెప్పడం లేదు. అంతకంటే తమాషా ఏమిటి అంటే.. రాష్ట్రానికి చెందిన ఎంపీలు పోరాటం చేయడం లేదని అయన ఎందుకు అనుకుంటున్నారో కూడా తెలియదు. ఏపీ లోని అన్ని పార్టీ ల ఎంపీలు కలిసి ఆరచి గీ పెట్టినా, గోల చేసినా ఖాతరు చేసే స్థితిలో మోడీ సర్కారు లేదని అయన ఎందుకు గుర్తించలేక పోతున్నారో.. లేదా, గుర్తించినా ఏమీ తెలియనట్లు నటిస్తున్నారో అర్ధం కావడం లేదు.
ఎంపీలు చేయగలిగినది ఇప్పటికే చాలా అయింది. ఇక ప్రజలు పోరాడడమే మిగిలింది. ఆ పోరాటానికి నాయకత్వం వహించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నాడా… అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎంపీలు ఏదైనా చేయాలని, ప్రతి వారూ చెప్పగలరు. కానీ తను ఒక పోరాటం నడిపించగల సత్తా ఉన్న వ్యక్తి అయి ఉండి కూడా, పవన్ మౌనం పాటించడం ధర్మం కాదని జనం భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాటలు మాని చేతల్లోకి దిగాలని జనం కోరుకుంటున్నారు.