అన్నయ్య చిరంజీవి – తమ్ముడు పవన్ కల్యాణ్ ఇద్దరి మధ్య దూరం దూరమైపోయిందోచ్ అని మెగా ఫ్యాన్స్ గంతులేశారు. సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో ఫంక్షన్‌కి చిరంజీవి రావడం, తమ్ముడితో సరదాగా గడపడం, పవన్ కూడా తన అన్నతో అనుబంధాల్ని సర్దార్ ఇంటర్వ్యూలలో పూస గుచ్చినట్టు చెప్పడం, అన్నయ్యపై కిల్లోలెక్కన ప్రేమ కురిపించడం.. ఇదంతా మెగా ఫ్యాన్స్ కళ్లముందు కదులుతూ ఉంది. అయితే.. ఆ ప్రేమ నెలరోజులు తిరక్కముందే గతుక్కుమంది. శ్రీజ పెళ్లికి పవన్ రాలేదు. పోనీలే.. సర్దార్ షూటింగ్లో ఉన్నాడని సర్దుకుపోవొచ్చు. తిరిగొచ్చాక కలిసింది లేదు. ఆఖరికి మెగా 150వ చిత్రం ప్రారంభోత్సవంలో పవన్ అలికిడి లేదు. ”అన్నయ్యకు మొదటి ఫ్యాన్ నేనే” అని చెప్పుకొనే పవన్.. 150వ చిత్రం చేస్తుంటే వెళ్లి విష్ చేసింది లేదు. సరికదా, ఇప్పుడు త్రివిక్రమ్ సినిమి అఆ ఆడియో ఫంక్షన్‌కి పనిగట్టుకొని వెళ్తున్నాడు.
ఇదంతా చూస్తుంటే అన్నయ్యకంటే స్నేహితుడికే పవన్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి అర్థమవుతూనే ఉంది. అన్నయ్య ఫంక్షన్లకు కావాలని పవన్ డుమ్మా కొట్టాడన్న విషయం పవన్ ఫ్యాన్పే నమ్ముతున్నారిప్పుడు. దీన్ని బట్టి.. అన్నదమ్ముల మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతూనే ఉందన్నది అర్థమవుతూ ఉంది. ”ప్రతీరోజూ మా అనుబంధాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు” అన్నది పవన్ మాట. నిజమే కావొచ్చు. కానీ ముఖ్యమైన సందర్భాల్లో అయినా.. భుజం భుజం కలపాలి కదా? మరి.. దీనికి పవన్ ఏమంటాడో??