వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి శనివారం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ డా.కోడెల శివప్రసాద్ ని కలిసి తెదేపాలో చేరిన మంది ఎమ్మెల్యేల రాజీనామాలు కోరాలని లేకుంటే వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఒక వినతి పత్రం ఇచ్చారు. దానిలో మరొక ఎమ్మెల్యే పేరు కూడా చేర్చవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు రింగు రోడ్డు సమీపంలో నిర్మితమవుతున్న ‘మై ఫార్ట్యూన్ హోటల్’ శంఖుస్థాపన కోసం శనివారం నగరానికి వచ్చినప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎమ్మెల్యే ముస్తాఫా వచ్చి ఆయనని కలిసారు. ముస్తాఫా గత కొన్ని నెలలుగా వైకాపాకి దూరంగా ఉంటున్నారు. ఆయన నరసరావు పేట తెదేపా ఎంపి రాయపాటి సాంభశివరావు అనుచరుడు. కనుక ఆయన కూడా త్వరలోనే తెదేపాలో చేరిపోవచ్చు.