మన ఒకరినుంచి ఏం ఆశిస్తున్నామో.. ఇతరుల విషయంలో మనం అదే తరహాలో స్పందించాలనేది పెద్దలు చెప్పే నీతి. ఈ విషయం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డికి తెలియదని మనం అనుకోలేం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆయన ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోతున్నారు. ఒకే అంశం మీద తాను తలచుకున్నడు ఇతరులు ఎలా స్పందించాలని ఆయన కోరుకుంటున్నారో… ఇతరులు వ్యవహరించినప్పుడు తాను అదే విధంగా స్పందించలేదనే సంగతిని మరచిపోతున్నారు. అవును ఇదంతా ఇప్పుడు జగన్మోహనరెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేయబోతున్న నిరశన దీక్ష గురించి.
పాలమూరు ప్రాజెక్టుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఎవరూ కాదనరు. దీనిని జగన్ మళ్లీ శనివారం నాడు చాలా విపులంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్లు తెరిపించేందుకే ఈ దీక్ష అని ఆయన ప్రకటించారు. ”నేను చెబుతున్న దాంట్లో తప్పుంటే సరిదిద్దుకుంటాను. తప్పు లేదంటే దీక్షకు అందరూ సహకరించాలి” అంటూ జగన్ ఇతర పార్టీల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. దీక్షకు కూర్చునే ఏ నాయకుడు అయినా ఇలా అన్ని పార్టీల మద్దతును కోరుతారు. తద్వారా.. తాము అందరితో కలసి మెలిసి పోరాడడానికి ఓపెన్‌గా ఉన్నాం అనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.
కానీ వాస్తవం ఏంటంటే.. ‘ఓపెన్’గా ఉండడం అనేది తాము దీక్షకు కూర్చుని ఇతరులను వచ్చి మద్దతివ్వమనడంలో మాత్రమే ఉంటే సరిపోదు. ఇతరులు దీక్షకు కూర్చున్నప్పుడు కూడా తాము అంతే ‘ఓపెన్’గా వారికి మద్దతిచ్చినప్పుడే అది నిరూపణ అయ్యేది.
ప్రస్తుతం పాలమూరు విషయానికే వస్తే.. ఆ ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం జరుగుతుందనడంలో సందేహం లేదు. ఆ విషయంమీద కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కాలంనుంచి పోరాడుతున్నది. కొన్ని రోజుల కిందటే ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో.. మహాధర్నా కూడా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి ఆ ధర్నాకు మద్దతుగా ఎవ్వరూ నిలబడలేదు. ధర్నా కాంగ్రెస్ పార్టీది గనుక, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, తాను మద్దతు ఇవ్వడం వలన వారు బావుకునేది ఏమీ లేదని తెలిసి కూడా.. వారికి మద్దతు ఇవ్వడానికి వైకాపా ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు తాను దీక్షకు కూర్చుంటుండగా.. తన సంకల్పానికి అందరూ కలిసి మద్దతు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు.
ఇతరులకు సహకరించే అలవాటు తనకు లేనప్పుడు.. తనకు ఇతరులు సహకరించాలని కోరే అధికారం, నైతిక హక్కు జగన్మోహనరెడ్డికి ఉంటుందా? అని ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు. ఈ కోణంలోంచి ఆలోచనను జగన్ అర్థం చేసుకోగలరో లేదో మరి!