”సేవ్ డెమాక్రసీ” నినాదంతో వైఎస్ జగన్మోహన రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన డిల్లీ యాత్ర ప్రయోజనం నెరవేరింది. ఫిరాయింపులను ప్రోత్సహించే తెలుగుదేశం దుర్నీతిని జాతీయ రాజకీయాల్లో చర్చకుతీసుకు వచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తూట్లు పొడుస్తున్నారన్న విషయం మీద జగన్ కు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఈ అంశాన్ని సిపిఎం పార్లమెంటులో ప్రస్తావిస్తుందని సీతారాం ఏచూరి చెప్పారు.
ఈ చర్యలేవీ పార్టీ ఫిరాయింపులను ఆపలేవు. చంద్రబాబు నాయుడిని కట్టడి చేయలేవు. అయితే జాతీయ రాజకీయ స్రవంతి లోకి జగన్ ప్రవేశించడానికి మాత్రం ”సేవ్ డెమాక్రసీ” యాత్ర ఉపయోగపడింది.
జగన్ ది మొదటి నుంచీ ఒంటెత్తు పోకడే..సొంత పత్రిక, సొంత న్యూస్ టివి వున్న జగన్ కార్యక్రమాలకు ఇతర పత్రికలవారిని, ఇతర టివిల వారినీ చాలాకాలం వరకూ ఆహ్వానించేవారుకాదు. ఫలితంగా ఇతర రాజకీనాయకులకు లభించే ఆబ్జెక్టివ్ సపోర్టు కూడా జగన్ కు మీడియా నుంచి లేకుండా పోయింది.
అలాగే కాంగ్రెస్ నాయకులతో తప్ప వేరేపార్టీల నాయకులతో జగన్ పరిచయాలు పెట్టుకోలేదు…పెంచుకోలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వల్ల జగన్ పార్టీకి లభించిన ఓట్లలో వున్నది కేవలం సానుభూతి మాత్రమే కాదని, ఆయన సంక్షేమ పధకాల పట్ల పేదవర్గాలలో వున్న ప్రేమాభిమానాలు, కొన్ని సామాజిక వర్గాలలో ఆయనకు వున్న గాఢమైన మద్దతు అని ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్న రాజకీయపార్టీలు గుర్తించాయి. గెలుపు వరకూ వచ్చి నిలచిపోయిన జగన్ అప్పుడే చొరవ చూపి వుంటే జాతీయ రాజకీయాల వేదిక మీద ఆయన స్ధానం మరోలా వుండేదేమో!
ఏమైనాగాని ఇంతవరకూ రాజకీయాల్లో జగన్ వొంటరి శక్తిగానే మిగిలిపోయారు. ”సేవ్ డెమాక్రసీ” పరిమాణంతో జగన్ తనచుట్టూ గీసుకున్న గీతను తానే చెరుపుకుని రాజకీయ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టయింది. తెలుగుదేశం అఖండ విజయం సాధించాకే జాతీయ రాజకీయవేదిక ఎన్ టిఆర్ వైపు దృష్టి పెట్టింది. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు కి ప్రతిస్పందనగా ఎన్ టి ఆర్ సారధ్యంలో సాగిన ప్రజాస్వామ్య పరిరక్షణా ఉద్యమం ఆయనను నేషనల్ ఫ్రంట్ కు సారధిగా నిలపడానికి పునాది అయ్యింది.
ఇవాళ వున్నది అదే పరిస్ధితి కాకపోయినా జగన్ కు ‘ఢిల్లీ పరిచయాలు’ మొదలవ్వడానికి ఫిరాయింపుల పర్వం ఒక అవకాశాన్ని ఇచ్చింది. రాజకీయాల్లో ఉన్నతస్ధాయిలో వున్న వారిపై అవినీతి లేదా ఇతర వ్యక్తిగత ఫిర్యాదులు, ఆరోపణలకు సాధారణంగా బయటి నాయకుల మద్దతు లభించదు. ఇంతవరకూ జగన్ చేసిన వన్నీ దాదాపుగా చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలే!
అదీగాక తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని అక్రమంగా ఆస్తులు సంపాదించారన్న కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళి వచ్చిన జగన్ చేసే అవినీతి ఆరోపణలకు విలువలేదు.
అధికారాన్ని పటిష్టపరచుకోడానికి, ప్రతి పక్షానికి భయపెట్టి సామ,దాన,బేధ, దండోపాయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం తీసుకుపోతోందన్న ఆరోపణలో వ్యక్తిగత అంశం గాక రాజకీయ వ్యవహారాలు వున్నాయి. ఇందువల్లే ఇది అన్ని పార్టీలనూ ఆకర్షిస్తోంది. కొన్ని పార్టీలతోనైనా ఒక మిత్రత్వాన్ని తెచ్చిపెడుతుంది! వ్యక్తిగతంగా చంద్రబాబుని దుమ్మెత్తి పోసే ఏక సూత్రకార్యక్రమాన్ని పక్కనపెట్టి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తెలుగుదేశం తూట్లుపొడుస్తున్న వివరాలు చాటుతూండటం వల్లే ఇది సాధ్యమైంది!