మోడీ భజన పరులందరికీ ఓ అద్భుత అవకాశం అందివచ్చింది. మోడీ దేవుడని, దేవుడు పంపిన దూత అని, దేవుడు ప్రసాదించిన వరం అని … రకరకాలుగా ఆయనను స్తుతించి ప్రసన్నం చేసుకుని, దేశప్రజల్లో ఆయనకు మహానుభావుడిగా ముద్ర వేయాలని తపించే పోయే కాషాయ దళాలు తాజాగా మరో ముచ్చటను కూడా అందరితో పంచుకోవచ్చు. ప్రధానిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ.. నరేంద్రమోడీ పట్ల ప్రజల్లో ఇంకా సానుకూలత, ఆదరణ వెల్లువెత్తుతూనే ఉన్నదని రాబోయే ఏడాది మొత్తం టముకు వేసుకోవడానికి వీలుగా ఇప్పుడు ఒక సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో మోడీ పనితీరుకు ఈ దేశంలో 62 శాతం మంది ప్రజలు ఇంకా నీరాజనం పడుతున్నట్లుగా సర్వే చేపట్టిన సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వారు నిగ్గు తేల్చారు.
ప్రధానిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి చేయడం అనేది ఏదో మహత్కార్యం అన్నట్లుగా మోడీ ఫీలయిపోతున్నారు. దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందుకు బాలీవుడ్ ప్రముఖులందరినీ కూడా పిలుస్తూ పెద్ద ఎత్తున వేడుకలు చేయబోతున్నారు. ఏం సాధించారు గనుక.. ఈ వేడుకలకు ఉత్సాహ పడుతున్నారో తెలియదు గానీ.. ఈ సర్వే ఫలితాలను కూడా కమల నాధులు తమ ప్రచారానికి విపరీతంగా వాడుకుంటారనేది మాత్రం తథ్యం.
కాకపోతే.. మన తెలుగురాష్ట్రాల ప్రజలకు మాత్రం ఈ సర్వే ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సర్వే నిజమే అయితే.. మన తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం అజ్ఞానంలో మగ్గిపోతున్నట్టే లెక్క! మోడీకి దేశం యావత్తూ ఇంకా అదే స్థాయిలో నీరాజనాలు పడుతున్న సంగతిని గుర్తించలేని గుడ్డితనంలో మనం మగ్గుతున్నట్లు లెక్క. ఎందుకంటే రెండు తెలుగురాష్ట్రాల్లోనూ మోడీ మీద ఎంత వ్యతిరేకత కరడుగట్టుకుని ఉన్నదో అందరికీ తెలుసు. ఏపీ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోడీ ఈ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా వంచించాడని అందరూ దారుణంగా తిట్టిపోస్తున్నారు. తెలంగాణ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. ప్రధాని అయిన రెండేళ్లలో ఒక్కసారి కూడా కనీసం తెలంగాణ గడ్డ మీద మోడీ కాలు పెట్టలేదనే కడుపుమంట అక్కడి ప్రజల్లో పుష్కలంగా ఉంది.
ఇలాంటి వ్యతిరేకతలు జనంలో పెల్లుబుకుతూ ఉండగా.. మోడీకి 62 శాతం జనాదరణ ఎక్కడినుంచి వచ్చిందో మనబోటి అజ్ఞానులకు అర్థమయ్యే సంగతి కాదు. ఇంతకూ సర్వే నిర్వహించిన సీఎంఎస్ వారు.. ఏ ప్రమాణాల మేరకు సర్వే నిర్వహించారో వెల్లడిస్తే తప్ప.. వారి చిత్తశుద్ధి మీద ప్రజలకు నమ్మకం ఏర్పడదు. ఏ రాష్ట్రాల నుంచి ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో.. ఏ వర్గాల వారు ఈ సర్వేలో పాల్గొన్నారో తెలిస్తే.. మోడీకి సర్వే ద్వారా దక్కిన ఆదరణ నిజమైనదేనా.. భజన పరులు పనిగట్టుకుని సృష్టించినదా? అనే సంగతి మనకు అర్థమౌతుంది.