‘నన్ను చుట్టుముట్టి రౌండప్ చేసేయొద్దు.. ఆ కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను’ అంటూ మహేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఎంత పాప్యులరో అందరికీ తెలుసు. పాపం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఇంచుమించు అలాగే కనిపిస్తోంది. మొన్నమొన్నటి వరకు కాస్త ధీమాగానే కనిపించినప్పటికీ.. ఇప్పుడు ఆయనకు మంత్రిపదవికి సంబంధించిన భయం బాగా పట్టుకుంది. ఆ టెన్షన్లో ఆయన తన అర్హతలను ఉన్నదానికంటె మించి చాటుకోవడానికి ఏదేదో మాట్లాడేస్తున్నారు. అడ్డగోలుగా ఫిరాయింపు జోస్యాలు చెప్పేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు కేబినెట్లో ముస్లిం వర్గానికి చెందిన మైనారిటీ మంత్రి ప్రస్తుతం లేరు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి మైనారిటీ శాఖను కూడా పల్లె రఘునాధరెడ్డే చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సొంత ఎమ్మెల్యేల్లో ముస్లిం వర్గానికి చెందిన వారు లేకపోవడమే ఇందుకు కారణంగా ఉండేది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి వలసల పర్వానికి తెర ఎత్తిన తర్వాత.. ముందస్తుగా జలీల్‌ఖాన్ వచ్చి చేరారు. ఆయన మైనారిటీ మంత్రి పదవికి బేరం పెట్టుకునే వచ్చి చేరారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.
తాను చేరిన తర్వాత.. విజయవాడలో మైనారిటీల భారీ సభ పెట్టించిన జలీల్‌ఖాన్, ఆ సభలో త్వరలో మీరు ముస్లిం వర్గానికి చెందిన మంత్రిని చూడబోతున్నారంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ తన గురించే అనుకుని మురిసిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా తెలుగుదేశం పార్టీలోనూ ఓ ముస్లిం ఎమ్మెల్సీ ఈ మంత్రి పదవికి పోటీ వస్తున్నారనే సంగతి అర్థమైంది. ఇప్పుడు ముస్తఫా వంటి వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఫిరాయిస్తున్న నేపథ్యంలో తన మంత్రి పదవి కలలకు గండి పడుతుందేమో అని ఆయనకు ఆందోళన మొదలైనట్లుంది. అందుకే తన అర్హతల్ని ప్రూవ్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు.
నా బోణీ బాగుంది గనుకనే.. వైకాపానుంచి తెదేపాలోకి ఇంత భారీగా వలసలు వస్తున్నాయ్.. అని చాటుకోవడం ఆయన లక్ష్యం. తన బోణీని చంద్రబాబు మెచ్చుకున్నట్లుగా చెప్పుకుంటున్నారు. వైకాపా కుండకు చిల్లు పెట్టింది తానేనని ఘనంగా చెప్పుకుంటున్నారు. గతంలో తాను ప్రత్యేకహోదా కోసం పోరాటం చేయాలంటే జగన్ హేళన చేశారంటూ కొత్త ఆరోపణలు కూడా గుప్పించారు. తాజాగా వైకాపానుంచి మరో నలభై మంది ఎమ్మెల్యేలు తెదేపాలోకి జంప్ చేయబోతున్నారంటూ కొత్త జోస్యం కూడా సెలవిచ్చారు. జగన్ విశ్వసనీయుల్లో ఒకరైన శ్రీకాంత్‌రెడ్డి కూడా వచ్చేస్తారనడం, ఆయన పదవులకోసం ఆశపడి వెళ్లడానికి నేనేమైనా జలీల్ ఖాన్నా.. అని కౌంటర్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. వైకాపానుంచి వలసలు మొత్తం తన ఘనతే అన్నట్లుగా జలీల్ ఖాన్ చాటింపు కనిపిస్తోంది. మరి ఇదంతా మంత్రి పదవి కోసం కాక మరేమిటి?