తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు మంగళ హారతి పాడేసి భరతవాక్యం పలికేయాలని కేసీఆర్ ఫ్యామిలీ చాలా దారుణంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. కేసీఆర్ తన ఆకర్ష మంత్రి ప్రయోగం ద్వారా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దాదాపుగా షట్టర్ దించేసే పరిస్థితి తీసుకువచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద ఫోకస్ పెంచారు. తెలంగాణ రాష్ట్రానికి అసలు కాంగ్రెస్ పార్టీ అవసరమే లేదంటూ ఆయన కుటుంబ మంత్రులు మాట్లాడుతున్నారు. తాజాగా మేడే సందర్భంగా పోరాటాల పార్టీలుగా తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వామపక్షాలకు కూడా చీటీ చించేయడానికి తెలంగాణ జాగృతి సారథి, కేసీఆర్ తనయ, ఎంపీ కవిత కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నారు. మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి వామపక్ష పార్టీల అవసరమే లేదని సెలవిచ్చారు.
ఈ స్టేట్మెంట్కు మద్దతుగా ఆమె చెప్పిన భాష్యం మాత్రం చిత్రమైనదే. ”ఎక్కడైనా సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటాలు ఉద్యమాలు జరుగుతాయి. వామపక్షాలు అందుకు పిలుపు ఇస్తాయి. ఇప్పుడు ఉద్యమాలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక.. మరొకరు పోరాడాల్సిన అవసరమే ఈ రాష్ట్రంలో రాదు.. పోరాటాలే అవసరం లేని రాష్ట్రంలో పోరాటాల పార్టీలుగా పేరున్న వామపక్షాలు కూడా ఉండనక్కర్లేదు అంటూ కవిత వివరణ ఇచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం అధికారం తమ చేతిలో ఉన్నది గనుక.. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన యావత్తు పోరాటమూ కేవలం తమ కుటుంబ ఘనత మాత్రమే అని చరిత్రను రికార్డు చేయించుకోవడానికి కేసీఆర్ కుటుంబసభ్యులు తపన పడిపోతున్నట్లుంది. గతంలో ఉస్మానియా విద్యార్థులు, ఉద్యోగులు ఉధృత స్థాయిలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వేర్వేరు సందర్భాల్లో తెరాస మౌనం పాటించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందరో త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో చివరి అంచె పోరాటానికి సారథ్యం వహించినందుకు గాను.. రాజమార్గంలో అధికారంలోకి వచ్చిన తెరాస.. ఇప్పుడు మిగిలిన పోరాటాలకు విలువ లేకుండా చేసేయాలని పూనుకోవడం, చరిత్రను వక్రీకరించడం, తెరాస తప్ప మరో పార్టీ ఉండరాదన్నట్లుగా తొక్కేయాలని చూస్తూ ఉండడం మాత్రం అనైతికంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.