తెలంగాణ ప్రభుత్వం పాలమూరులో నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, కేసీఆర్ బుద్ధిలో మార్పు రావడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేయదలచుకుంటున్న నిరశన దీక్ష.. ఆయన లక్ష్యాన్ని ఏమేరకు సాధిస్తుందో గానీ.. తెలంగాణ రాష్ట్రంలో ఆయన పార్టీ మనుగడకు మాత్రం మంగళహారతి పాడే పరిస్థితి కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తెరాసలో చేరిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ ఫిరాయింపు పూర్తయితే.. ఇక తెలంగాణ రాష్ట్రంలో వైకాపాకు చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యే మాత్రమే మిగులుతారు. లేదా, ఖమ్మం జిల్లాకే చెందిన ఆయన కూడా పొంగులేటితో పాటూ గులాబీ పార్టీలోకి జంప్ చేస్తారేమో కూడా అనుమానమే!
పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెరాసలో చేరవచ్చుననే ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. తాను తెరాసలో చేరుతున్నట్లు ప్రచారాన్ని గతంలో ఆయన ఖండించారు కూడా! అయితే ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షస్థానంలో ఉంటూ ఫిరాయించేయడం అంటే.. తగిన కారణాలను చూపించాల్సి ఉంటుందని ఆయన ఇన్నాళ్లూ ఆగినట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా.. పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా జగన్ తలపెట్టిన నిరశనను పొంగులేటి తనకు సదవకాశంగా ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వైకాపా అధినేత జగన్ ప్రస్థానం తెలంగాణ ప్రయోజనాలను కాలరాసేలా ఉంటున్నందున తాను ఆ పార్టీనుంచి బయటకు వస్తున్నాననే నెపం చూపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ దళం లో చేరుతారని అంతా ఊహిస్తున్నారు.
వైఎస్ జగన్ తొలినుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా ప్రాధాన్యం ఇచ్చి నెత్తిన పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలోనే.. ‘మీరు శీనన్నను ఎంపీగా గెలిపించండి.. ఆయనను కేంద్రమంత్రి చేసే బాధ్యత నాది’ అంటూ జగన్ చాలా డాంబికంగా ప్రకటించారు కూడా! విభజన తర్వాత రెండురాష్ట్రాలకు పార్టీ శాఖలు ఏర్పాటుచేసినప్పుడు ఆయననే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఎన్ని చేసినప్పటికీ చివరికి ఈ రాష్ట్రంలో వైకాపా ప్రస్థానం ‘దుకాన్ బంద్’ దిశగానే సాగుతున్న వాతావరణం కనిపిస్తోంది.