ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో అటు మోడీ సర్కారు అడ్డగోలుగా ప్రజలను వంచిస్తూ ఉంటే, ఇటు చంద్రబాబు సర్కారు సరైన ప్రయత్నం చేయడంలో విఫలం అవుతున్నదని యావత్తు ప్రజలు నమ్ముతున్నారు.
చంద్రబాబు తన రాజధాని, రెండంకెల అభివృద్ధి, పరిశ్రమల వెల్లువ వంటి ఎన్ని మాటల ద్వారా ఎంతగా ప్రజలను నమ్మించాలని చూస్తున్నా.. ప్రత్యేకహోదా దక్కకపోవడంలో వైఫల్యం పూర్తిగా చంద్రబాబుదే, తెదేపాదే అని జనం నమ్మడంలో ఆశ్చర్యం కూడా లేదు. అయితే ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెదేపా నాయకులు చాలా భారీ డైలాగులు సంధిస్తూ ఉండడం విశేషం. తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు, ప్రతిపక్షాలు అన్నీ కలిసి, తెదేపా వైఫల్యాన్ని మరింతగా ఎండగడుతున్న నేపథ్యంలో తెదేపా నేతలు హోదాకోసం పోరాడుతాం అంటూ మాటలు మాత్రం ఘనంగానే చెబుతున్నారు.
తాజాగా గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేయడం విశేషం. తమకు మిత్రపక్షం అయినంత మాత్రాన కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను వదిలిపెట్టే సమస్యే లేదని, చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహంగా సెలవివ్వడం విశేషం. విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కేంద్రం నెరవేర్చాల్సిందే అని ఆయన అంటున్నారు.
ఈ డైలాగులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యాక్షన్ పార్ట్ వరకు వచ్చేసరికి తెలుగుదేశం విఫలం అవుతున్నదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘విభజన చట్టంలోని అంశాలు అన్నీ’ అనే మెలిక ద్వారా.. ‘ప్రత్యేకహోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా కాంగ్రెస్ వంచించింది’ అనే మాయమాటలు చెప్పడానికి తెదేపా నేతలు పూర్వరంగం సృష్టిస్తున్నారని కూడా జనం అనుమానిస్తున్నారు. జనంలోని అనుమానాలు ఆగ్రహంగా మారకముందే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ మీద ఏవగింపు పుట్టకముందే.. హోదా కోసం సరైన యాక్షన్ ప్లాన్‌తో చంద్రబాబు సర్కారు సాధించుకురావాలని అంతా కోరుకుంటున్నారు.