చట్టాలను చేసే వారే వాటిని ఉల్లంఘిస్తారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ప్రజల నెత్తిమీద కూర్చొని ఊరేగాలని చూస్తారు. ప్రజా ధనాన్ని తాతగారి ఆస్తిలా ఖర్చు చేస్తారు. వీవీఐపీల పేరుతో చిల్లర వేషాలు వేస్తారు. బాధ్యతా రాహిత్యానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తారు. ఎవరేమనుకుంటే మాకేంటి సిగ్గు అన్నట్టు ప్రవర్తిస్తారు. మన దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు ప్రదర్శించే విన్యాసాలివి.
గత ఏడాది ఎంపీలుగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలో సర్కారీ బంగళాలు ఇచ్చే వరకూ చాలా మంది ఎంపీలు ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. కొంత కాలానికి వరసగా ఒకరి తర్వాత ఒకరికి బంగళాలు కేటాయించారు. అయినా, సర్కారు బంగళాకంటే ఫైవ్ స్టార్ హోటలే మోడ్రన్ గా ఉంటుంది కదా. అందుకని చాలా మంది దాన్ని వదిలిపెట్టలేదు. అలాగని హోటల్ వాళ్లు బిల్లు వదిలిపెడతారా? అశోకా హోటల్ వారు గత ఏప్రిల్ వరకే 26 కోట్ల 70 లక్షల బిల్లు వేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ సొమ్మును చెల్లించింది అనేకంటే, ప్రజలమైన మనమే ఆ భారాన్ని భరించామనడం కరెక్ట్.
ఇక, నూరేళ్లకు పైబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉండటం అంటే అన్ని విషయాలపై అవగాహన, బాధ్యత ఉంటాయని అనుకుంటాం. అంబికా సోనీ, సెల్జా అనే ఇద్దరు మహిళా మాజీ మంత్రులు తమ చేష్టలతో హైకోర్టు తిట్లు తిన్నారు. జరిమానా శిక్షకు గురయ్యారు. పదవిలో ఉన్నప్పుడు విశాలమైన భవంతుల్లో వీరు దర్జాగా ఉన్నారు. ఇంకా వాటిలోనే ఉంటామని దబాయిస్తూ వచ్చారు. అది కుదరదని, టైప్ 7 బంగళాల్లోకి మారాల్సిందేనని కేంద్రం గట్టిగా చెప్పేసరికి, రాజకీయం గుర్తుకు వచ్చింది. బీజేపీ ప్రభుత్వం కావాలని తమను వేధిస్తోందని ఆరోపించారు. అదేం మాట అని ఢిల్లీ హైకోర్టు ఇద్దరికీ తలంటింది. చెరో 25 వేల రూపాయల జరిమానా విధించింది.
ప్రజలకు సేవ చేస్తామని, దేశం కోసం పాటుపడతామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారు, చట్టాలను చేసేవారు మరి పార్లమెంటులో వ్యవహరిస్తున్న తీరు సరిగా ఉందా? ఒక్కరోజైనా సభ సాఫీగా జరుగుతుందనే గ్యారంటీ ఉందా? లేనేలేదని ముందే ప్రకటిస్తున్నారు. మా డిమాండును ఒప్పుకొనే వరకూ సభను జరగనిచ్చేది లేదని ముందే ప్రకటించి మరీ సభను స్తంభింప చేస్తున్నారు. మనం చెమటోడ్చి సంపాదించిన డబ్బులోంచి కొంత పన్నులుగా కట్టిన సొమ్మును ఎంత దారుణంగా బూడిదలో పోసిన పన్నీరుగా దుబారా చేస్తున్నారు? కానీ ఏం చెయ్యగలం!!