ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో తెదేపా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తోందని నిరసిస్తూ నేడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుదిపై తీవ్ర ఆరోపణలు చేసారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకం అమలుచేయడం కోసం రూ.4,000 కోట్లు మంజూరు చేస్తే, దానిలోంచి సిమెంటు రోడ్ల నిర్మాణానికి, నీరు-చెట్టు కార్యక్రమాలకి సుమారు రూ.2,500 కోట్లు మళ్ళించారు. కేంద్రం ఇచ్చిన నిధులను వేరే పనులకు మళ్ళించడం తప్పని తెలిసినా ఆయన తన ఇష్టం వచ్చినట్లు దానిని ఖర్చు చేస్తున్నారు. ఉపాధి దొరకకపోవడంతో ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్లు లేదు. పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ జిల్లాలో ప్రజలకి త్రాగడానికి నీళ్ళు ఉండవు. ఇప్పుడే ఈ పరిస్థితి నెలకొని ఉంటే తెలంగాణా ప్రభుత్వం ఎగువన కృష్ణా నదిపై ప్రాజెక్టులు నిర్మిస్తే ఏమవుతుంది? అయినా కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిలదీసి అడగరు. ఎందుకంటే గట్టిగా అడిగితే ఆయన ఓటుకి నోటు కేసుని బయటకు తీస్తే జైలుకి వెళ్ళవలసి ఉంటుందనే భయం చేతనే,” అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పంపుతున్న నిధులను తెదేపా ప్రభుత్వం సరిగ్గా లెక్కలు అప్పజెప్పడం లేదని, వేరే పనులకు మళ్లిస్తోందని రాష్ట్ర భాజపా నేతలు కూడా ఆరోపిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తుండటం గమనార్హం. అంటే ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయనే దానికి అది మొదటి సంకేతమా? అనే అనుమానం కలుగుతోంది. అలాగే జగన్ ఎన్నడూ లేనివిధంగా కేసీఆర్ పేరుపెట్టి విమర్శలు చేయడం గమనార్హమే. తెలంగాణాలో వైకాపా దాదాపు మూతబడినట్లే కనుక ఇంకా తెరాస దాని అధ్యక్షుడు కేసీఆర్ కి అణిగిమణిగి ఉండాల్సిన అవసరం లేదనే ఉద్దేశ్యంతోనే జగన్ ఆవిధంగా మాట్లాడుతున్నారేమో? వేసవి ఎండలకి నిప్పుల కొలిమి మారిన మాచెర్లలో ఎండలని, వడగాడ్పులను లెక్కజేయకుండా భారీ సంఖ్యలో ప్రజలు జగన్ సభకి తరలి రావడం విశేషమే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిపై జగన్ చేసిన తీవ్ర ఆరోపణల ప్రభావం సభకు హాజరయినవారిపై ఎంతో కొంత తప్పక ఉంటుంది కనుక ఇకనయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేల్కొనడం మంచిదేమో?