తెలంగాణా ప్రభుత్వం చేపట్టబోతున్న పాలమూరు తదితర ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో మే 16 నుండి మూడు రోజుల పాటు నిరాహార దీక్షకు కూర్చోబోతున్నారు. తను చేయబోయే దీక్ష తెరాస ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించవచ్చని జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోలేము. అయినా సిద్దం అవుతున్నారంటే అందుకు చాలా కారణాలే కనబడుతున్నాయి.
సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే దెబ్బకు కనీసం ఒక అరడజను పిట్టలనయినా కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. ఇది కూడా అటువంటి ప్రయత్నమేనని చెప్పవచ్చు. ఆయన డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని కేంద్రానికి పిర్యాదులు చేయడం ద్వారా ఆంద్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని తెదేపా నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. బహుశః దానికి కౌంటర్ గానే అకస్మాత్తుగా ఈ అంశాన్ని భుజానికెత్తుకొని ఉండవచ్చు. తద్వారా తనే ఆంధ్రా ప్రయోజనాలను, హక్కుల కోసం పోరాడుతున్నానని, తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రాకి రావలసిన నీళ్ళను తోడేసుకొంటున్నా తెదేపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకొంటోందని జగన్ చెప్పుకోవచ్చు. అంతే కాదు ఈ అంశంపై నిప్పు రాజేయగలిగినట్లయితే అది ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మళ్ళీ చిచ్చుపెట్టగలదు. అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆత్మరక్షణలో పడవచ్చు. అప్పుడు వైకాపాకి చంద్రబాబు నాయుడిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే అవకాశం కల్పిస్తుంది.
తెదేపా నేతలు ఆరోపిస్తున్నట్లు తనకు తెరాసతో రహస్య అవగాహన ఏమీ లేదని చెప్పుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తను నిజంగానే తెలంగాణాలో ప్రాజెక్టులని అడ్డుకొనేందుకే ఈ దీక్ష చేయడం లేదని, తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు నాయుడిని ఇరుకున పెట్టే ఉద్దేశ్యంతోనే చేస్తున్నదని తెరాస ప్రభుత్వం కూడా అర్ధం చేసుకొంటుంది కనుక దీని వలన తెరాసతో తన సంబంధాలేవీ దెబ్బ తినవనే నమ్మకం కూడా ఉండి ఉండవచ్చు. హరీష్ రావు విమర్శలలో అదే కనబడింది. ఇవన్నీ ఎలాగున్నా ఆంధ్రాలో రైతన్నలు, ప్రజలకు తెలంగాణా ప్రాజెక్టుల వలన అన్యాయం జరగకుండా పోరాడుతున్న మంచిపేరు ఎలాగు వస్తుంది. ఇందులో ఇన్ని ప్రయోజనాలు ఇమిడి ఉన్నందునే జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా ఈ అంశం భుజానికి ఎత్తుకొని ఉండవచ్చు.