మేక్ ఇన్ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిన్నతరహా స్వదేశీ పరిశ్రమలు, వ్యాపార సంస్ధలు మహా వేగంగా పతనమౌతున్నాయి. కేవలం వంద రోజుల్లో 7761 సంస్ధలు, ఏడాదిలో 61 వేల సంస్ధలు మూతపడ్డామని కంపెనీవ్యవహారాలు, ఆర్ధికశాఖల మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు.
ఈ కంపెనీలన్నీ ఆకస్మికంగా కుప్పకూలిపోయాయి అనికాదు. ప్రభుత్వ విధానాల వల్లా, సొంత తప్పిదాల వల్లా కృశించి, కృశించి పతనమైనవే. మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఏడాదిపాలనలో కూడా స్వదేశీ కంపెనీలను బతికంచే వాతావరణం తీసుకురాలేకపోవడమే అసలువిషయం. నినాదాలకు ఆచరణకు పొంతన లేదనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. చెప్పేవి చైనా మాటలు చేసేవి అమెరికా చేతలు అన్నట్టు వుంది కేంద్రప్రభుత్వ పారిశా్రమిక విధానం. కేంద్రప్రభుత్వ విధానాలు స్వదేశి పరిశ్రమలను ప్రోత్సహించేవిగాలేవని పరిశ్రమల సమాఖ్య ‘ఆసోచామ్’ విచారాన్ని వ్యక్తం చేసింది.
స్వదేశీ ఉత్పత్తులకు చైనాని ప్రస్తుతించే ప్రధాని మోదీ భారతదేశంలో ఆ విధానాలను మాత్రం తీసుకురావడంలేదు. తరచు చైనా సంస్కరణల గురించి ప్రస్తావించే వస్తు తయారీ రంగం (మ్యానుఫ్యాక్చరింగ్ రంగం)లో చైనా సాధించిన అసాధారణ పురోగతి వెనుక చిన్న పరిశ్రమల పాత్ర గురించి ఏమీ మాట్లాడటంలేదు.
భారత్‌లో చిన్న పరిశ్రమలు దేశీయ బడా కంపెనీల ఉత్పత్తులతో పోటీ పడలేక చతికిల పడుతుంటే, చైనాలో చిన్న పరిశ్రమలు గ్లోబల్ మార్కెట్‌తో పోటీ పడేస్థాయికి చేరుకున్నాయి. అక్కడి చిన్న పరిశ్రమలు సాంప్రదాయక టెక్నాలజీ నుంచి అధునాతన టెక్నాలజీవైపు మళ్లుతూ అతి తక్కువ ఖర్చుతో అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు చేస్తూ ఇతర దేశాలకు ఎగుమతులు చేయగలిగే స్థితికి చేరాయంటే అక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత అటువంటిది.
ఇక్కడ మేక్ ఇన్ ఇండియా పేరుతో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానంలో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహించే చర్యలూ లేవు. విదేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించి, ఇక్కడ సరుకులను ఉత్పత్తి చేసి వాటిని ఎగుమతి చేయడం ద్వారా పారిశ్రామిక ప్రగతి సాధించాలన్నది మేక్ ఇన్ ఇండియా ఉద్దేశమన్నారు. ఇది ప్రస్తుత ప్రపంచ వాస్తవికి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో వుంచుకుని రూపొందించిన విధానం కాదని ఆర్థికరంగంలో ఏమాత్రం పరిజ్ఞానం వున్నవారైనా ఇట్టే చెప్పేస్తారు.
ప్రపంచ వ్యాపితంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ఎగుమతులపై దృష్టిపెట్టడం అవివేకం. ఈ విషయంలో చైనాను చూసి అయినా నేర్చుకోవాలి. చైనా ప్రభుత్వం ఒక వైపు దేశీయ మార్కెట్‌ను పటిష్టపరచుకుంటూ, మరో వైపు ఎగుమతులపై దృష్టి సారించింది. మోడీ ప్రభుత్వ విధానం దీనికి పూర్తి రివర్స్‌లో వుంది. దేశీయ మార్కెట్ పటిష్టపరచుకోవాలన్న స్పృహే మోడీ ప్రభుత్వానికి కొరవడింది. దేశీయమార్కెట్ను బలపరచుకోవడమంటే చిన్న తరహా పరిశ్రమలను శక్తిమంతం గావించుకోవడమే. చిన్న పరిశ్రమలను పటిష్టపరచుకోవడమంటే ఉపాధిని పదిలపరచుకోవడమే. ఉపాధి అవకాశాలు ఎంతగా విస్తరిస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి అంతగా పెరుగుతుంది. అప్పుడే ఉత్పత్తి అయిన సరుకులు మార్కెట్లో అమ్ముదవుతాయి. సరుకులకు గిరాకీ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. అది మళ్లీ పరిశ్రమల విస్తరణకు, ఉపాధి పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇదంతా ఒక వలయం. మోడీ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్ల దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి విదేశీ పెట్టుబడులొచ్చిందేమీ లేదు. మాన్యుఫేక్చర్ రంగమే సహజవనరులు 125 కోట్ల జనాభాకు చేరుతున్న భారత జనాభాకు విస్తృతంగా ఉపాధి అవకాశాలిచ్చేది చిన్న, మద్యతరహా మాన్యుఫాక్చర్ రంగమే! ఈ వాస్తవవం నరేంద్రమోదీకి తెలియక కాదు. అయితే భారీ పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు అవకాశమివ్వడం ద్వారానే భారతదేశం వేగంగా అభివృద్ది చెందగలదని నరేంద్రమోదీ భావిస్తున్నారు.
చైనా పారిశ్రామిక విధానాలు హెచ్చుమందికి ఉపాధి ఇచ్చి సంపదలు సమంగా అందేలా చూసి సమాజంలో ఆర్ధిక తారతమ్యాలను తగ్గిస్తాయి. అమెరికా పారిశ్రామిక విధానాలు మెగా పెట్టుబడిదారులకే లాభాలు మూటగట్టి సమాజంలో సంపన్నులకు సామాన్యులకు వ్యత్వాసాన్ని విపరీతంగా పెంచేస్తాయి.