తెలుగునాట సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావుకి కూడా రాజకీయ ఒత్తిళ్ళు తప్పలేదు. ఆ విషయం ఆయనే స్వయంగా తన ‘కొమ్మినేని ఇన్ఫో’ వెబ్ సైట్ లో తెలియజేసారు. ఆయన ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఎన్.టీవిలో చాలా కాలంగా రోజూ ఉదయం పూట రాజకీయ చర్చా వేదిక నిర్వహించేవారు. దానిలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొని వివిద అంశాలపై తమ తమ అభిప్రాయాలు చెప్పేవారు. చాలా తెలుగు న్యూస్ చానళ్ళలో అది జరుగుతున్నదే కానీ కొమ్మినేని నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చేది. ఆయన సున్నితంగా నిర్మోహమాటంగా అధికార, ప్రతిపక్ష పార్టీల తప్పొప్పులను ఎత్తిచూపిస్తుంటారు.
సరిగ్గా అదే కారణం చేత ఆయన కార్యక్రమాన్ని నిలిపివేయాలని తెదేపా ప్రభుత్వం నుంచి ఆ ఛానల్ యాజమాన్యంపై ఒత్తిడి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఛానల్ యాజమాన్యం అందుకు అంగీకరించకపోవడంతో దాని ప్రసారాలు కొన్ని నెలలపాటు నిలిపివేశారని తెలిపారు. తన వలన ఒక సంస్థ మూతపడితే, దానిలో పనిచేసే అనేకమంది ఉద్యోగులు వారి కుటుంబాలు వీధిన పడతారనే ఉద్దేశ్యంతో తన ఉద్యోగం నుంచి తప్పుకొనేందుకు సిద్దమయినప్పటికీ అందుకు ఆ ఛానల్ యాజమాన్యం అంగీకరించలేదని తెలిపారు. తాత్కాలికంగా కొన్ని నెలలపాటు శలవు తీసుకొన్నప్పటికీ ఇంకా ఆ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రస్తుతం ఆ ఛానల్ చైర్మన్ చౌదరి గారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని కొమ్మినేని తెలిపారు.
తన వంటి ఒక సామాన్య జర్నలిస్ట్ చేసే వ్యాక్యానాలకి చాలా శక్తివంతమైన ప్రభుత్వం భయపడాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. తన కంటే చాలా మంది సీనియర్లు ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోవడం చూసాను కానీ చివరికి తనకు అదే పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని అనుకోలేదని తెలిపారు. ఒక జర్నలిస్టుగా ప్రజల తరపున నిలబడి అధికార తెదేపాతో సహా అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించడమే తను చేస్తున్న పని అని కొమ్మినేని తెలిపారు. దానిని ప్రభుత్వం తప్పుగా భావించినా తాను తప్పని అనుకోవడం లేదని అన్నారు. ఆ విలువలకు కట్టుబడి తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవడానికి సిద్దం అని కొమ్మినేని తెలిపారు.