ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి రెండు రాజకీయ సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకటి తెదేపా-భాజపాల తెగతెంపులు కాగా రెండవది ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య మళ్ళీ వివాదాలు. ఈ రెంటికీ కారణం జగన్మోహన్ రెడ్డే కావడం యాదృచ్చికం మాత్రం కాదు. వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి తరలించుకొని పోతుండటంతో దానిని అడ్డుకొనేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్న అస్త్రాలు ఇవి.
ఇంతకాలంగా ఆయన తెదేపా-భాజపాల మద్య దూరం పెంచేందుకు, అదే సమయంలో తను భాజపాకి దగ్గరయ్యేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. కానీ ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో చేసిన డిల్లీ యాత్రతో ఆ రెండు పార్టీల మద్య చిచ్చు రగిలించగలిగినట్లు తెదేపా నేతల, మంత్రుల తాజా ప్రకటనలు విన్నట్లయితే అర్ధం అవుతుంది.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరింత స్పష్టమయిన సంకేతాలు ఇస్తూ “ఒకప్పుడు ఆంద్ర ప్రదేశ్ ప్రజలను చులకనగా చూసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఒకవేళ భాజపా కూడా అదేవిధంగా ప్రవరిస్తే దానికీ అటువంటి గుణపాఠమే చెప్తారు. రాష్ట్రం పట్ల కేంద్రం ఇదే వైఖరి కొనసాగిస్తే భాజపాతో పొత్తులు కొనసాగించడం ఇంకా కష్టమే,” అని అన్నారు.
ఇంతవరకు రాష్ట్ర భాజపా నేతలెవరూ తెదేపా నేతల, మంత్రుల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు అంటున్న ఇటువంటి మాటలకి సమాధానం చెప్పలేదు కానీ త్వరలోనే చెప్పడం తధ్యం. బహుశః వారు తమ అదిష్టానంతో దీని గురించి చర్చించుకొని, తెదేపా పట్ల తమ పార్టీ ఎటువంటి వైఖరి అవలంభించబోతోందో స్పష్టం చేయవచ్చు.
ఏదో ఒకరోజు తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొంటాయని అందరూ ఊహించారు కాని ఇంత అకస్మాత్తుగా ఆ పరిస్థితి వచ్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకవేళ అదే జరిగితే అది జగన్ ప్రయోగించిన ఒక అస్త్రం తన లక్ష్యాన్ని చేదించినట్లే.
ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న జగన్ తెదేపా ప్రభుత్వంపై ప్రయోగిస్తున్న రెండవ అస్త్రం తెలంగాణా ప్రభుత్వాన్ని సవాలు చేయడం. కృష్ణా నదిపై అది చేపడుతున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల పధకాలను వ్యతిరేకిస్తూ మే 16,17,18వ తేదీలలో కర్నూలులో నిరాహార దీక్ష చేయబోతున్నారు. దానికి అప్పుడే తెరాస మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి చాలా ఘాటుగా స్పందనలు వచ్చేయి.
“ఆంధ్రా ప్రభుత్వం వ్యతిరేకించినా సరే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతామని వారిరువురూ చాలా స్పష్టంగా చెప్పారు. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రులు కూడా స్పందించక తప్పనిసరి పరిస్థితులు కల్పించారు జగన్. ఒకవేళ వారు కూడా అదే స్థాయిలో స్పందిస్తే మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు మొదలవడం ఖాయం. స్పందించకపోతే ఓటుకి నోటు కేసుకి భయపడే చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను నష్టపరుస్తున్నారని విమర్శలు గుప్పిస్తూ, తెదేపాకు తీవ్ర నష్టం కలిగిస్తుంటారు. కనుక ఇదీ తెదేపాకు ఒక పెద్ద సమస్యగా తయారయ్యే అవకాశం ఉంది.