2014 ఎన్నికలలో నరేంద్ర మోడీ విజయానికి, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో నితీష్ కుమార్, లాలూ, కాంగ్రెస్ కూటమి విజయానికి బాటలు వేసి మంచి ఎన్నికల వ్యూహకర్తగా పేరు సంపాదించుకొన్న ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీకి ఊహించని పెద్ద షాక్ ఇచ్చేరు. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా రాహుల్ గాంధీని నిలబెట్టాలని ఆయన సూచించారు.
రాహుల్ గాంధీ నెహ్రు కుటుంబంలో పుట్టిన కారణంగా ప్రధాన మంత్రి పదవిని చేపట్టడం ఆయన జన్మహక్కుగా భావిస్తుంటే, ప్రశాంత్ కిషోర్ ఆయనని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే బాగుంటుందని సూచించడం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేని విషయమే. అందుకు వారు ఆయనకు నిరసన తెలిపారు కూడా. అయితే రాహుల్ గాంధీ ఎప్పటికయినా ప్రధాన మంత్రి కావాలనుకొంటే, అందుకు ఇదే సరయిన మార్గమని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడుతున్నారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వచ్చే ఎన్నికల నాటికి దేశంలోని భాజపాని వ్యతిరేకిస్తున్న పార్టీలను అన్నిటినీ ఏకంచేసి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి తనే ప్రధాన అభ్యర్ధిగా నరేంద్ర మోడీతో పోటీ పడాలని ఉవ్విళ్లూరుతున్నారు. దాని కోసం ఆయన అప్పుడే పావులు కదపడం మొదలుపెట్టారు కూడా. ఆయనకి అప్పుడే లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారు. ఒకవేళ ఆంధ్రాలో తెదేపా, భాజపాలు తెగతెంపులు చేసుకొంటే చంద్రబాబు నాయుడు కూడా నితీష్ కుమార్ కే మద్దతు పలుకవచ్చు. అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ వంటివారు కూడా నితీష్ కుమార్ కే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి తప్ప రాహుల్ గాంధీ కాదు.
ఒకవేళ నితీష్ కుమార్ తన ప్రయత్నాలలో సఫలం అయ్యి, దేశంలో ప్రాంతీయ పార్టీల మద్దతు పొందగలిగితే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటి? అని ఆలోచిస్తే ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహా ఆచరణీయమైనదేనని అర్ధమవుతుంది.
ఒకవేళ 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ముగ్గురూ పోటీ పడితే, ప్రజలు మోడీ లేదా నితీష్ కుమార్ కే మొగ్గు చూపుతారు తప్ప రాహుల్ గాంధీకి కాదని వేరేగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వారిద్దరూ తమ సమర్ధతని పలుమార్లు నిరూపించి చూపుకొని ప్రజల ఆదరణ, అభిమానాన్ని పొందుతున్నారు. కానీ రాహుల్ గాంధీకి పదేళ్ళపాటు అవకాశం ఉన్నా కూడా తన సమర్ధతని నిరూపించుకోలేకపోయారు. అంతే కాదు నేటికీ ఆయన తల్లి, అక్క చాటు పిల్లాడిగానే గుర్తింపు కలిగి ఉన్నారు. కనుక దేశ ప్రజలకు ఆయనపై అంత మంచి అభిప్రాయం ఏమీ లేదు. ఆ సంగతి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. కనుక ఈ చేదు వాస్తవాన్ని అంగీకరించి, ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాను పాటించితే, రాహుల్ గాంధీ ప్రధాని కాలేకపోయినా కనీసం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రయినా అయ్యే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికలలోగా ఆయనకిది పైలట్ ప్రాజెక్టుగా కూడా స్వీకరించవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రిగా అయన తన సమర్ధతను నిరూపించుకోగలిగితే, అప్పుడు మోడీ, నితీష్ కుమార్ లతో పోటీ పడవచ్చు.
ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఈ చేదు సలహాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవడం, అంగీకరించడం రెండూ కష్టమే కానీ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని గ్రహించినప్పుడు, ముఖ్యమంత్రిగా సెటిల్ అవడమే మంచిది కదా? కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంకో భయం కూడా ఉంటుంది. రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేసిన తరువాత ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోతే… రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కాలేకపోతే…ఒకవేళ అయినా లోకం ఏమనుకొంటుంది? అనే భయాలు సహజం. కనుక రాహుల్ గాంధీ భవిష్యత్ కోసం కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసి ప్రశాంత్ కిషోర్ సలహా పాటిస్తుందా లేక అయితే ప్రధాని లేకుంటే రాజకీయ సన్యాసమే మేలని భావిస్తుందా…చూడాలి.