ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు డిఫెన్స్‌లో పడిపోతున్నారు. ఇప్పుడు హఠాత్తుగా రాష్ట్ర పరిణామాలు అన్నీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారిపోతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ విషయం ఆ పార్టీకి చెందిన మంత్రుల్లో కూడా ఆందోళనను కలిగిస్తోంది. సోమవారం నాడు విజయవాడలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపించింది. కేబినెట్ మీటింగ్ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఏ ఇద్దరు మంత్రులు విడిగా మాట్లాడుకున్నప్పటికీ వారి మధ్య ఇవే చర్చలు నడిచాయి. ఇరుకున పడిపోతున్నాం.. జనం వద్ద చెడ్డ పేరు రాకుండా ఏదో ఒకటి చేయాల్సిందే అనే మాటలే మంత్రులు అనుకున్నారు.
ఒక వైపు ప్రత్యేక హోదా అంశం ముడిపడి పోతున్నది. అంతా రాష్ట్ర ప్రభుత్వ చేతగాని తనమే అని అందరూ నిందిస్తున్నారు. మరోవైపు జగన్ నిరశన దీక్షను ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో ప్రాజెక్టుల అంశం కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చకు వస్తున్నది. ఈ విషయంలో కూడా ఏపీ సర్కారు ఏమీ చేయడం లేదనే చర్చే ప్రజల్లో నడుస్తున్నది. ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి చేసినట్లుగా కనిపించకపోతే ప్రజల ముందు చాలా చులకన అయిపోతాం అని చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులు తమలో తాము రకరకాలుగా చర్చించుకున్నారట.
మంత్రుల మాటల మధ్య ఒక అభిప్రాయం వెల్లడైనట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ ని గట్టిగా నిలదీసే ధైర్యం తమకు లేదని.. హోదా విషయంలో ఏదో మాటలు చెప్పడం తప్ప తాము చేయగలిగేది ఏమీ లేదని… కనీసం తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల విషయంలోనైనా గట్టిగా పోరాడకపోతే.. ఏపీ అన్ని అంశాలనూ గాలికి వదిలేస్తున్నదనే భావన ప్రజలకు వస్తుందని వారు అంటున్నారట. మోడీని ఏం చేయలేం గనుక.. కనీసం ప్రాజెక్టులపై పోరాటం ఉండాలని.. కనీసం మనం ఏదో ఒకటి చేస్తున్నాం అని జనాన్ని నమ్మించవచ్చునని వారు అనుకుంటున్నారట. అయితే అది చంద్రబాబు నిర్ణయ పరిధిలో ఉంటుంది గనుక.. ఆయన తానుగా పూనుకుంటే తప్ప.. రాష్ట్ర నేతలుగా తాము పరువు కాపాడుకునే పరిస్థితి లేదని మంత్రులు విచారిస్తున్నారట.