ఆకుకు అందకుండా, పోకకు చిక్కకుండా తప్పించుకోవడం అనేది బహుశా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అందమైన భామలు తనకోసం కలలు కనేలా ఎంత సునాయాసంగా వారిని బాహుబంధాలలో ఉంచగలరో… దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకర్లు అందరూ తన గురించి అంతగానే కలవరం చెందేలాగా కూడా వారి బతుకులను దిగ్బంధనం చేయగలరు! ఆయన విజయ మాల్యా. బ్యాంకర్లకు 9000 కోట్ల రూపాయలు ఎగవేసి.. ఇప్పటికీ తన తప్పు ఏమీ లేదంటూ బుకాయిస్తున్న… నన్ను తీసుకెళ్తే మీకు రూపాయి కూడా రాదు.. నేనే ఇస్తా.. ఇచ్చే వరకూ ఆగండి అంటూ డబాయిస్తున్న విజయమాల్యా తాజాగా తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజ్యసభ నైతిక విలువల కమిటీ తన సభ్యత్వాన్ని రద్దు చేయడానికి నిర్ణయించిన తర్వాత.. వారు వేటు వేయడానికి ముందే మాల్యా తన పదవికి రాజీనామా చేయడం విశేషం.
బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో విచారణను ఎదుర్కొంటూ దేశంనుంచి బ్రిటన్ పారిపోయిన విజయమాల్యా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కూడా! ఆయన మీద ఆర్థిక నేరాల ఆరోపణలు అన్నీ లెక్క తేలిన తర్వాత… రాజ్యసభ నైతిక విలువల కమిటీ సమావేశమై.. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. వారుగా రద్దుచేస్తే.. తన పరువు మరింతగా పోతుందని భయపడిన మాల్యా, సరిగ్గా వారు ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక్కరోజు ముందు రాజీనామా చేశారు.
అయితే ఈ సందర్భంగా విజయమాల్యా రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు మాత్రం చిత్రమైనవి. ”నా విషయంలో విచారణ న్యాయబద్ధంగా సాగదని, నాకు న్యాయం జరగదని ఇటీవలి పరిణామాలను బట్టి అర్థమవుతోంది” అంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం. అందుకోసమే ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారట. కేంద్ర ఆర్థిక శాఖ తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ ఆయన నిందలు వారి మీద వేయడం విశేషం.
అయితే ఆయన పాల్పడిన ఆర్థిక నేరాల విషయంలో ఆయన ఎంపీ కావడం అనేది అడ్డు కాలేదు. ఆయన దేశం వదిలిపోయిన తర్వాత.. భారత్ ఆయన పాస్‌పోర్టును రద్దు చేసింది. తిరిగి భారత్‌కు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నది. కాకపోతే.. మాల్యా సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా.. ఆయనను ఎంపీగా చేసిన కాంగ్రెస్ పార్టీ తమకు కాస్త పరువునష్టం తప్పుతుందని ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది.