నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సరయిన విదేశీ విదానమేదీ లేదని కాంగ్రెస్ పార్టీ తరచూ విమర్శిస్తూ ఉంటుంది. దాని విమర్శలను నిజం చేస్తున్నట్లుగా ఉంది విదేశాంగ సహాయ మంత్రి సమాధానం. లోక్ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ప్రతిపక్షాలను, దేశ ప్రజలను కూడా నివ్వెరపోయేలా చేసింది. కాశ్మీరీ వేర్పాటువాదులతో పాకిస్తాన్ దౌత్యాధికారులు సమావేశం కాకూడదని నిషేధం విధించినప్పటికీ వారి సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారిని అడ్డుకొన్నా ఏదో ఒకచోట ఏదో ఒక సందర్భంలో సమావేశామవుతూనే ఉన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలలో ప్రజలు విదేశీయులతో మాట్లాడే స్వేచ్చ కలిగి ఉన్నట్లే, భారత్ లో అంతర్భాగమయిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఆ స్వేచ్చ ఉంటుందని మా ప్రభుత్వం భావిస్తోంది. కనుక హురియత్ నేతలు, పాక్ దౌత్యాదికారుల సమావేశాలపై విధించిన నిషేధాన్ని కొనసాగించడంలో అర్ధం లేదని భావించి, దానిని ఎత్తివేశాము. అయితే భారత్ అంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని, గత ఒడంబడికల ప్రకారమే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని పాక్ ప్రభుత్వానికి తెలియజేశాము,” అని లిఖిత పూర్వకంగా మంత్రి సమాధానం ఇచ్చారు.
రెండేళ్ళ క్రితం భారత్-పాక్ సంబంధాలు సరిగ్గా ఈ కారణంగానే దెబ్బ తిన్నాయి. భారత్ తో చర్చలకు బయలుదేరిన పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్, భారత ప్రభుత్వంతో చర్చలు మొదలుపెట్టే ముందు కాశ్మీరీ వేర్పాటు వాదులతో సమావేశం కావాలనుకొన్నారు. అందుకు మోడీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినా కూడా పాక్ మంకు పట్టు పట్టడంతో చర్చలు రద్దయ్యాయి. ఆ తరువాత మోడీ లాహోర్ పర్యటనతో మళ్ళీ ఇరుదేశాల సంబంధాలు మెరుగుపడినట్లు కనబడినా అవి పఠాన్ కోట్ దాడులతో మళ్ళీ మొదటికొచ్చాయి. అప్పటి నుంచి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
ఆ వ్యవహారంలో పాక్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరి అటువంటప్పుడు మోడీ ప్రభుత్వం పాక్ పట్ల మరింత కటినంగా వ్యవహరిస్తుందని అందరూ ఆశిస్తారు కానీ పాక్ పట్ల మళ్ళీ మెతక వైఖరి ప్రదర్శించుకొంటూ వేర్పాటువాదులతో సమావేశం అవడానికి వీలు కల్పించింది. ప్రపంచంలో ఏ దేశమయినా ఈవిధంగా తమ దేశంలోని వేర్పాటువాదులను ప్రోత్సహిస్తుందా?
మరి మోడీ ప్రభుత్వం ఆవిధంగా ఎందుకు చేసింది అంటే దాని విదేశీ విధానంలో లోపం అయినా ఉండాలి లేకుంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మహబూబా ముఫ్తీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపేందుకు ఇది కూడా ఒక షరతు అయ్యుండవచ్చు. ఆమె నేతృత్వం వహిస్తున్న పిడిపి వేర్పాటువాదులకు అనుకూల వైఖరి అవలంభిస్తుంది కనుక ఆమె ఒత్తిడి కారణంగానే మోడీ ప్రభుత్వం వేర్పాటువాదులను పాక్ దౌత్యాదికారులతో సమావేశాలు కావడానికి మోడీ ప్రభుత్వం అంగీకరించి ఉండవచ్చు. కనుక ఇది మోడీ విదేశాంగ విధానంలో అయోమయమా లేక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలో కొనసాగేందుకు తాపత్రయమా?అనేది ఇదమిద్ధంగా తెలియకపోయినా వేర్పాటువాదులు, పాక్ పట్ల అది చాలా మెతకవైఖరి అవలంభిస్తోందని ఖచ్చితంగా చెప్పవచ్చు.