కొమ్మినేని శ్రీనివాసరావు ఎన్‌టివిలో లైవ్‌షో చేయక మూడు మాసాలు గడిచినా ఇప్పుడే తెరవెనక జరిగిందేమిటో బహిరంగంగా పరోక్ష పద్ధతిలో వివరించేందుకు సిద్ధమైనారు. ఇదంతా చదివితే ఆయన షో నిర్వహస్తున్న పద్ధతిపై యాజమాన్యానికి అభ్యంతరంలేదనీ, పరిస్థితుల రీత్యా తనను తప్పించినందుకు ఆయనకూ దానిపై కోపం లేదనీ అర్థమవుతుంది. ఉభయ కుశలోపరిగా పరిష్కారం గురించే మాట్లాడుతున్నారు. ఆయన కనిపించడం మానేశాకే తెలుగుదేశం ప్రతినిధుల ఆ షోలో కనిపిస్తున్నారు గనక ఇది పూర్తిగా పాలకపక్షం ఒత్తిడి ఫలితమేనని కూడా తెలిసిపోతుంది.
తర్వాత ఏం చేస్తారంటే సాక్షిలో చేరతారని అనేక కథనాలు గతంలోనే వచ్చాయి. ఇది తనపై వేసిన వైసీపీ అనుకూల ముద్రను పెంచుతుందనే సంకోచంతో తటపటాయిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. కాని ఎవరేమనుకున్నా ఉద్యోగం ఇస్తామంటే ఎందుకు పరిశీలించకూడదని కొమ్మినేని అనుకుంటున్నట్టు సమాచారం. రాజకీయ ఆర్థిక బలం లేని సంస్థలు ఆయనను చేర్చుకుని ఏలిన వారి కోపానికి గురికావు. ఆ విధంగా చూసినా వామపక్ష సంస్థలతో ఎలాగూ కుదర్దు గనక సాక్షి కనిపిస్తుంది. దానికి తగినట్టే ఆయన లేఖను లేదా స్పందనను సాక్షి పూర్తిగా ప్రముఖంగా ప్రచురించింది. అయితే ఆయన అక్కడ వెంటనే చేరడం గాక వ్యవధి తీసుకోవడం లేదా సందర్భం చూసుకుని చేరడం జరగొచ్చు. ఇప్పటికే వెబ్సైట్లలో ఆయన బాగా పనిచేస్తున్నారు గనక దాన్నే మరింత విస్త్రత పర్చుకునే ప్రయత్నం చేయొచ్చునంటున్నారు..