భూమా నాగిరెడ్డి తెదేపాలో చేరికను శిల్పా మోహన్ రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు నాయుడు ఆయనని ఒప్పించి భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకొన్నారు. అప్పటి నుండి కర్నూలులో ఆ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే ఉంది. వారి ఘర్షణలు ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళాయంటే, శిల్పా అనుచరుడి హత్యకు దారి తీసేంత! ఆ కేసు సంగతి ఏమయిందో ఎవరికీ తెలియదు కానీ ఇరు వర్గాల మద్య ఘర్షణ పడుతూనే ఉన్నాయి. భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వలన జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుకొంటే, వారి గొడవల మూలంగా పార్టీ పరువుపోయే పరిస్థితి ఏర్పడింది. కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకోక తప్పలేదు. ముందుగా వారిద్దరితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట రావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి అచ్చెం నాయుడు మాట్లాడిన తరువాత, వారిరువురూ రాజీ పడేందుకు సిద్దమయ్యారు. ఇవ్వాళ్ళ వారిని ముఖ్యమంత్రి వద్దకు తోడ్కొని వెళ్ళగా ఆయన కూడా అందరూ తమ భేషజాలను, విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం కలిసిపని చేయాలని గట్టిగా చెప్పారు. మళ్ళీ ఇటువంటి సమస్య తన చెవిన పడకూడదని ఇద్దరినీ చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత వారివురూ బయటకు వచ్చి మీడియాతో తాము రాజీ పడ్డామని, ఇకపై ఏవైనా సమస్యలొస్తే ఇద్దరం కూర్చొని మాట్లాడుకొంటామని తెలిపారు. అదే పని ముందే చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు కదా? అయినా ఇంతకాలం రాజకీయంగా బద్ధ విరోధులుగా ఉన్న వారిద్దరి మద్య ఈ సక్యత ఎంత కాలం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.