హైదరాబాద్: లలిత్ గేట్, వ్యాపం తదితర బీజేపీ కుంభకోణాలపై ప్రతిపక్షాలు తొమ్మిదిరోజులుగా పార్లమెంట్‌లో కార్యకలాపాలను అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవాళకూడా ఈ తంతు కొనసాగింది. అధికారపక్షాన్ని ఈ కుంభకోణాలపై నిలదీస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధి ఇవాళ లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడిపై పంచ్ వేశారు. మన్ కీ బాత్ పేరుతో ప్రజలకు తన మనోభావాలను వెల్లడిస్తున్న మోడి ఈ కుంభకోణాలపై తన మనసులో మాట ఎందుకు చెప్పటంలేదని ప్రశ్నించారు. మోడి రేడియోలో మన్ కీ బాత్ కార్యక్రమంద్వారా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపైనే సోనియా పంచ్ వేశారు. ఎన్నికలముందు, అధికారంలోకి వచ్చిన మొదట్లో – దేశప్రజానీకానికి ఎన్నో ఆశలు కల్పించిన మోడి, అమిత్ షా బృందం ఈ కుంభకోణాలపై నోరు మెదపకపోవటం ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తున్నమాటమాత్రం వాస్తవం. దీనిని కాంగ్రెస్ బాగానే ఉపయోగించుకుంటోంది. సోనియా, రాహుల్ ఇటీవలికాలంలో రెట్టించిన ఉత్సాహంతో అధికారపక్షాన్ని ఎండగడుతున్నారు.