కథానాయకులు ప్రతినాయడి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఆది పినిశెట్టి… సరైనోడులో విలన్‌గా కనిపించాడు. రానా కూడా బాహుబలిలో అదగొట్టేశారు. ఇప్పుడు సుధీర్ బాబు కూడా ‘నేనూ రెడీ’ అంటున్నాడు. ఎస్సెమ్మెస్ సినిమాతో ఆకట్టుకొన్న కథానాయకుడు సుధీర్ బాబు. ప్రేమకథా చిత్రమ్‌తో తొలి హిట్ అందుకొన్నాడు. మాస్ హీరోగా నిలబడే ప్రయత్నాలు చేస్తూనే బాలీవుడ్లో బాఘి సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినా… సుదీర్‌కి మాత్రం మంచి పేరొచ్చింది. అందుకే ఇప్పుడు తెలుగులోనూ ఆ తరహా పాత్రలు చేయడానికి సిద్ధమే అంటున్నాడు.
”బాఘి సినిమాలో నా నటనకు మంచి స్పందన వస్తోంది. తరణ్ ఆదర్శ్‌లాంటి వాళ్లు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నిజానికి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చినప్పుడు ఏదో చిన్న పాత్ర కోసం పిలిచారనుకొన్నా. వెళ్తే.. విలన్ వేషం ఇచ్చారు. ఆ పాత్రకు ఇంత మంచి స్పందన వస్తుందనుకోలేదు. తెలుగులోనూ విలన్ గా నటించే అవకాశాలొస్తే అస్సలు వదులుకోను. కథానాయకుడిగా నా మైలేజీ తగ్గిపోతుందన్న భయం లేదు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యం” అంటున్నాడు. మరి తెలుగులో సుధీర్‌బాబుకి అలాంటి పాత్రలు ఎవరిస్తారో చూడాలి.