తెలంగాణా వైకాపా అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఆయన తనతో బాటే పార్టీలో మిగిలిన ఒకే ఒక ఎమ్మెల్యే వెంకటేశ్వరులుని కూడా వెంట తీసుకొనిపోవడంతో తెలంగాణాలో ఆ పార్టీకి నాధుడు లేకుండాపోయాడు. పొంగులేటి పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల క్రితమే తెలుసు కానీ ఆ సంగతి తెలియనట్లు ఊరుకొన్నారు. పాలేరు ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి సుచరితా రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరుతూ తన వద్దకు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలను ఆయనే జగన్ వద్దకు తోడ్కొని పోయారు. అప్పుడు కూడా ఆయన పార్టీ మారబోతున్నట్లు బయటపడలేదు. జగన్ కూడా అడగలేదు. చివరికి ఊహించినట్లే పొంగులేటి వైకాపాకి గుడ్ బై చెప్పేసి తెరాస లో చేరిపోయారు. ఇప్పుడు అత్యవసరంగా అయన స్థానంలో మరొకరిని నియమించవలసి వచ్చింది. ఆయన స్థానంలో కొండా రాఘవ రెడ్డిని నియమించే అవకాశం కనబడుతోంది.
ఈరోజు ఆయన హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి ఈ గుర్తింపుకి నోచుకోవడానికి, ఈ స్థాయికి చేరుకోవడానికి వైకాపాఏ కారణం అటువంటి పార్టీకి నమ్మకద్రోహం చేసి తెరాసలో చేరిపోయారు. వెళ్ళేటప్పుడు ఆయన తన ఎంపి పదవిని విడిచిపెట్టి వెళ్లిఉంటే గౌరవంగా ఉండేది. పార్టీ ద్వారా దక్కిన పదవిని అట్టేబెట్టుకొని, పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏమి న్యాయం? తెలంగాణా అభివృద్ధిలో పాలుపంచుకోవదానికే తెరాసలో చేరుతున్నానని చెప్పుకొన్న ఆయన ఇంతకీ తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి ఏమి చేసారని చేరారు? అని ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి కలను ఏవిధంగా నెరవేర్చుకోవాలనే ఎంతసేపు ఆలోచిస్తుంటారు తప్ప తెలంగాణాలో వైకాపాని నమ్ముకొన్నవారి గురించి ఆలోచించలేదు. తన కలని నెరవేర్చుకోవడం కోసం ఆయన గత రెండేళ్లుగా తెదేపా ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నా ఆంధ్రాలో పార్టీ మనుగడ కష్టంగా మారింది. మరి తెలంగాణాలో ఎన్నడూ ప్రజాసమస్యలపై నోరు మెదపని వైకాపా ఏవిధంగా మనుగడ సాగించగలదు? అని ఆలోచించలేదు. ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో తన ఉనికినే చాటుకోవడానికి ఇష్టపడనప్పుడు, ఆ పార్టీనే నమ్ముకొన్న నేతల, కార్యకర్తల పరిస్థితి ఏమిటి? అని జగన్ ఏనాడూ ఆలోచించలేదు. జగన్ తన స్వార్ధం చూసుకొంటే పొంగులేటి తనదారి తను చూసుకొన్నారని సర్ది చెప్పుకోక తప్పదు. కనుక ఆయనను నిందించవలసిన అవసరం లేదు. అది జగన్ స్వయంకృతాపరాధమే తప్ప మరొకటి కాదు. కనుక పొంగులేటి స్థానంలో ఎవరు వచ్చినా కూడా జగన్ వైఖరి మారనప్పుడు తెలంగాణాలో వైకాపాని కాపాడటం ఎవరివలనా సాధ్యం కాదని చెప్పవచ్చు.