దొంగని దొంగ అంటే చాలా కోపం వచ్చినట్లు, బ్యాంకులని మోసం చేసి లండన్ పారిపోయి, సుప్రీం కోర్టు ఆదేశించినా దేశానికి తిరిగి రానని, ఒకవేళ బలవంతంగా రప్పించినా తన దగ్గర నుంచి దమ్మిడీ రాలదని నిసిగ్గుగా, నిర్భయంగా చెపుతున్న విజయ్ మాల్యాకి భారత్ మీడియా తనను ‘ఎగవేతదారు’ అని సంభోదిస్తుంటే చాలా కోపం వచ్చేసింది.
“నా గురించి వ్రాసేటప్పుడు నన్ను ‘ఎగవేతదారు’ అని సంభోదించవద్దని భారత్ మీడియాకి వినమ్రంగా మనవి చేస్తున్నాను. నేను ఆలు అప్పులే తీసుకోనప్పుడు నన్ను ఎగవేతదారుడని ఏవిధంగా నిందిస్తారు? కనుక నాగురించి వ్రాసేటప్పుడు ముందుగా పూర్తి వివరాలు తెలుసుకొని వ్రాయవలసిందిగా కోరుతున్నాను,” అని విజయ మాల్యా ట్వీట్ చేశారు.
తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ బ్యాంకులకు భారీ మొత్తంలో బకాయిలు పడిన మాట వాస్తవమని ఆయన అంగీకరించారు కానీ ఆ బాకీలతో తనకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. ఆ బాకీలు తీర్చేందుకు నేను సిద్దపడుతున్నా నన్ను ఎగవేతదారు అని ఎందుకు నిందిస్తున్నారు? అని ప్రశ్నించారు.
మొదట అసలు తను బ్యాంకులకు బాకీలేనని చెప్పారు. కానీ తన కింగ్ ఫిషర్ బాకీ ఉందని ఒప్పుకొన్నారు. మళ్ళీ దానితో తనకు సంబంధం లేదన్నారు. కానీ దాని బాకీలు తీర్చుతానని అంటున్నారు. ఆయన నోటితోనే ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మీడియా ఆయనని తప్పు పట్టడంలో తప్పేముంది? అయినా భారత్ మీడియాలో ఆయన గురించి ఏమనుకొంటే ఆయనకేమిటి? బ్యాంకులు, ఈడి, న్యాయస్థానాలు, కేంద్ర ప్రభుత్వం ఆయన గురించి ఏమనుకొంటున్నాయనేదే ముఖ్యం కానీ.
“బ్యాంకుల దగ్గర తన సంస్థ పేరిట అప్పులు తీసుకొని, ఇప్పుడు దానితో సంబంధం లేదంటే కుదరదని, మర్యాదగా వచ్చి అన్ని అప్పులు తీర్చుకోమని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోక తప్పదని,” కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ప్రభుత్వం ఆయన పాస్ పోర్ట్ ని రద్దు చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దు చేయడానికి సిద్దపడితే, అంతకంటే ముందుగా ఆయన తన రాజీనామా పత్రాన్ని పంపించారు. ఇవన్నీ భారత్ మీడియా చేసిన పనులు కావు. మరి మీడియాపై ఆగ్రహం ఎందుకు? ఒకప్పుడు ఆయన కింగ్ ఫిషర్ సంస్థ గురించి, ఆయన వ్యాపార దక్షత గురించి భారత్ మీడియా మంచి కవరేజి ఇచ్చినపుడు ఆయన దానిని ఆనందించారు. దాని వలన ఆయన పేరు ప్రతిష్టలు చాలా పెరిగాయి కూడా. ఇప్పుడు అదే మీడియా ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంటే ఆయనకి రోషం వస్తోంది. పొగడ్తలు జీర్ణించుకొన్నంత తేలికగా విమర్శలను జీర్ణించుకోలేరు కనుకనే విజయ మాల్యాకి మీడియాపై ఆగ్రహం కలుగుతున్నట్లుంది. తనను ఎవరూ వేలెత్తి చూపకూదదనుకొంటే అటువంటి పరిస్థితి రాకుండా బుద్ధిగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ చేయకూడనివి అన్నీ చేసి, ఇంకా చేస్తూ తనను ఎవరూ వేలెత్తి చూపకూదదంటే ఎలా?