వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మొత్తం ఇక మూత పడినట్లే అనుకుంటున్న తరుణంలోనే.. ఆ పార్టీ హైదరాబాద్ కార్యకలాపాలకు మొత్తంగా ఫుల్స్టాప్ పడిపోనున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న లోటస్ పాండ్ నుంచి మంగళగిరి లేదా విజయవాడకు తరలించేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. అధినేత జగన్ కూడా.. రాజకీయ, పార్టీ కార్యకలాపాలు అన్నీ కూడా అక్కడినుంచే నిర్వహించాలని కూడా పార్టీ నిర్ణయిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడితో తెలంగాణలో రాజకీయంగా మాత్రమే కాదు.. అస్తిత్వం పరంగా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రస్థానానికి భరతవాక్యం పలుకుతున్నట్లే లెక్క. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించిన రోజుల్లో.. జూబ్లీహిల్స్‌లో ఓ అతిపెద్ద భవనాన్ని పార్టీ కార్యాలయంగా అద్దెకు తీసుకున్నారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం ఆ వర్గాల్లో ఉన్న సమయంలో.. ఈ పార్టీ కార్యాలయం చాలా వైభవ స్థితిలోనే నడిచింది. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత.. రాష్ట్రం విడిపోయిన తర్వాత.. జూబ్లీహిల్స్ కార్యాలయం కార్యకలాపాలు మందగించిపోయాయి. అద్దె కూడా పార్టీకి భారంగా మారే పరిస్థితి వచ్చింది. దీంతో ఆ భారాన్ని వదిలించుకుని.. పార్టీ కార్యాలయాన్ని లోటస్ పాండ్‌లోని జగన్ నివాసంలోకే మార్చేశారు. పార్టీ రెండు రాష్ట్రాల శాఖల కార్యాలయాలు ఇక్కడినుంచే నడిచేవి.
తాజాగా తెలంగాణ వైకాపా పూర్తిగా ఖాళీ అయిన నేపథ్యంలో లోటస్‌పాండ్ కార్యాలయంలో పని సగం ఖాళీ అయిపోయినట్లే. అదే సమయంలో చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు అన్నిటినీ ఏపీకి సంబంధించినంత వరకు ఏపీనుంచే నడిపిస్తున్నారు. అటు ప్రభుత్వమూ, పాలక పార్టీ కార్యకలాపాలు అన్నీ విజయవాడ కేంద్రంగానే నడుస్తున్నాయి. అలా ఉన్న సమయంలో.. ప్రధాన ప్రతిపక్షం మాత్రం హైదరాబాదు కేంద్రంగా ఉండడం అనేది పార్టీకే నష్టదాయకం అని వారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఏపీ నూతన రాజధాని చెంతనే కొత్త పార్టీ ఆఫీసు పెట్టుకోవాలని సంకల్పిస్తున్నారట. మంగళగిరిలో గానీ, విజయవాడలోగానీ స్థలం చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా కేంద్ర కార్యాలయం ఏపీ రాజధానికి వెళ్లిపోతే.. లోటస్‌పాండ్ లోని జగన్ నివాసం మొత్తం బోసిపోతుందనే అనుకోవాలి. అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్‌లో కొన్ని ఎకరాల్లో విస్తరించిన ఆయన నివాస/ కార్యాలయ భవన సముదాయం మొత్తం కేవలం ఆయన కుటుంబానికి మాత్రమే పరిమితం అవుతుంది.